రాజకీయాలు చాలా చిత్రమైనవని అంటారు.. పదవులు పొంది ఇక ఫర్వాలేదు పార్టీలో సెట్ అయ్యాము అనుకోగానే ఆ పదవికి గండం ఏర్పడటం.. లేదా రాత్రికి రాత్రే పదవులు ఉడిపోవడం ఆ నాయకుడి అదృష్టమో, దూరదృష్టమో అర్థం కాదు. గత బీఆర్ఎస్ లో ఒక వెలుగు వెలిగిన నేతల పదవులను కేసీఆర్ హఠాత్తుగా పీకేసిన రోజులను మరచిపోలేము. కానీ ఇప్పుడు అలా జరగలేదు.. ఈ సారి ముప్పు మరో పార్టీ నుండి తరిమింది.. ఇది ఆ నాయకుడి బ్యాడ్ లక్ అనాలేమో..
ఎన్నో రాజకీయ డక్కిమొక్కీలు తింటూ అదృష్టానికి-దురదృష్టానికి మధ్య ఊగుసలాడుతున్న నేత దానం నాగేందర్.. పార్టీలు మారినా, గెలుపు గుర్రాలు ఎక్కినా ఈయనకు రాజకీయంగా చిక్కులు తప్పడం లేదు. ఈ క్రమంలో దానం రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే.. గెలుపులు, ఓటములు, పార్టీ మార్పులు, పదవులు, అనూహ్య పరిణామాలు.. అన్నీ కలగలిసిన ప్రయాణంలా కనిపిస్తుంది.
ఇప్పుడు హైకోర్టు అనర్హత వేటుతో మరోసారి దానం రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనపై దాఖలైన ఫిరాయింపు పిటిషన్‌లో కీలక అంశంగా మారింది. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు.. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది.
అయితే దానం రాజకీయ జీవితంలో ఇలాంటి మలుపులు కొత్తకాదని తెలుస్తుంది. 2004లోనూ దాదాపు ఇదే తరహా పరిణామం కనిపించింది. అప్పట్లో టీడీపీ నుంచి ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఐఎం చేతిలో ఓడిపోయారు. అంటే.. పదవి కోసం తీసుకున్న రాజకీయ నిర్ణయం చివరికి ఎన్నికల పరాజయానికి దారితీసింది.
ఆ తర్వాత 2009లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2014లో ఓడిపోయారు. 2018లో టీఆర్ఎస్‌లో చేరి మళ్లీ ఖైరతాబాద్‌లో గెలిచారు. 2023లో బీఆర్ఎస్ తరఫున మరోసారి గెలిచినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 2024 మార్చిలో కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది సికింద్రాబాద్ లోక్‌సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఇక్కడే దానం రాజకీయ ప్రయాణంలోని ఒక ఆసక్తికరమైన ప్యాటర్న్‌ను రాజకీయ విశ్లేషకులు గుర్తిస్తున్నారు. 1994, 1999లో ఆసిఫ్‌నగర్ నుంచి గెలిచినప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004లో టీడీపీ తరఫున గెలిచినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2009లో మాత్రం ఖైరతాబాద్ నుంచి గెలవడంతో పాటు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చింది. 2014లో ఓడిపోగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది.
2018లో దానం గెలిచారు.. టీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది. 2023లో మళ్లీ గెలిచినా బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. 2024లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవినే కోల్పోయారు. అందుకే దానం రాజకీయ ప్రయాణాన్ని చూస్తే.. ఎప్పుడు ఏంటి ఈ పరిస్థితి అనే ప్రశ్న సహజంగానే వస్తోంది. ఒకప్పుడు పార్టీ అధికారంలోకి రావడం, తాను గెలవడం.. మరొకసారి తాను గెలిచినా పార్టీ అధికారానికి దూరం కావడం..
ఇప్పుడు తాజా అనర్హత వేటు తర్వాత మరో కీలక అంశం ఉపఎన్నిక.. ఇక దానం నాగేందర్ ప్రజాక్షేత్రంలో తిరిగి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఆయనకే మళ్ళీ సీటు దక్కుతుందా లేదా అన్న క్లారిటీ లేదు. మరొకవైపు ఆయన పోటీకి సిద్దమైన గెలుస్తాడా లేదా అనే అనుమానాలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఈ అవకాశాన్ని జారవిడుచుకోవు అనే టాక్ ఉంది.
ఇక 2004లో రాజీనామా చేసి ఉపఎన్నికలో ఓడిన దానం.. 2024లో రాజీనామా చేయకుండా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అనర్హత వేటుతో మళ్లీ ఉపఎన్నిక ముంగిట నిలిచారు. గతం ఒకసారి ఓటమి చూపించింది.. వర్తమానం మరోసారి పరీక్ష పెడుతోంది. ఈసారి దానం రాజకీయ అదృష్టం ఏ మలుపు తీసుకుంటుందో.. ఖైరతాబాద్ తీర్పే చెప్పాల్సి ఉంది...











