Saudi Arabia: సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు సాగిస్తున్న వరుస డ్రోన్ దాడులతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇంధన కేంద్రాలు, పౌర విమానాశ్రయాలే లక్ష్యంగా జరిగిన ఈ భీకర దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఇండియన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.
పౌరులపై దాడులు అస్సలు సహించబోం: భారత్
సాధారణ ప్రజలు తిరిగే ప్రదేశాలు, వాణిజ్య మౌలిక సదుపాయాలపై ఇలాంటి దాడులకు తెగబడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర విదేశాంగ శాఖ గట్టిగా స్పష్టం చేసింది. ఇలాంటి విధ్వంసకర చర్యలను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది. సౌదీ అరేబియా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విషయంలో అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చింది. ఆ ప్రాంతంలో త్వరలోనే శాంతి నెలకొనాలని ఆకాంక్షించింది. దాడిలో మరణించిన భారత పౌరుడి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపిన ప్రభుత్వం, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని పేర్కొంది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. బాధితులకు కావాల్సిన పూర్తి వైద్య, సహాయ సదుపాయాలను దగ్గరుండి చూసుకుంటోందని వెల్లడించింది.
దమ్మాం విమానాశ్రయంపై దాడి.. ఇద్దరు మృతి
బుధవారం రాత్రి దమ్మాం విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని సౌదీ పౌర విమానయాన సంస్థ ధ్రువీకరించింది. మృతుల్లో ఒక సౌదీ పౌరుడు, ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు స్పష్టం చేసింది. దాడి వల్ల ఎయిర్‌పోర్టుకు జరిగిన నష్టాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
గత కొద్దివారాలుగా సౌదీలోని చమురు క్షేత్రాలు, పౌర విమానాశ్రయాలపై హౌతీల దాడులు ఊహించని స్థాయికి చేరాయి. భద్రతా పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పడంతో రియాద్‌లోని ప్రధాన ఎయిర్‌పోర్టును మూసివేయడంతో పాటు, దేశంలో జరగాల్సిన భారీ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును సైతం అధికారులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్రిక్తతలు పెరుగుతుండటం, మరోవైపు భారత పౌరుడు మృతి చెందడంతో ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచింది.


