icici bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా జరిపే నగదు లావాదేవీల చార్జీలను సవరిస్తూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలలో భారీగా నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసే కస్టమర్ల జేబులకు మరింత చిల్లు పడనుంది.
బ్యాంక్ వెల్లడించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. బ్రాంచీలతో పాటు క్యాష్ రీసైక్లర్ మెషిన్ల ద్వారా జరిపే నగదు లావాదేవీలపై చార్జీలను పెంచారు. నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే లావాదేవీల్లో ప్రతి వెయ్యి రూపాయలపై ఇప్పటివరకు ఉన్న రూ.3.50 చార్జీని రూ.4కి పెంచారు. కనీస చార్జీగా రూ.150 వసూలు చేస్తారు. ఈ రెండింటిలో ఏ మొత్తం ఎక్కువైతే దాన్ని ఖాతాదారుడి నుంచి కట్ చేసుకుంటారు.
అయితే ఈ పెంపు సాధారణ లావాదేవీలు చేసుకునే అందరిపై పడదు. ప్రతి నెలా ఉచితంగా ఇచ్చే 3 క్యాష్ డిపాజిట్లు, 3 క్యాష్ విత్‌డ్రాయల్స్ యథావిధిగా కొనసాగుతాయి. అలాగే నెలకు రూ.1 లక్ష వరకు ఫ్రీ లావాదేవీల పరిమితి ఉంటుంది. ఆ ఉచిత పరిమితిని దాటి లావాదేవీలు జరిపే వారికి మాత్రమే ఈ అదనపు బాదుడు వర్తిస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ లావాదేవీలకు మాత్రమే అలవాటు పడిన వారికి ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదు.


