BRS: తెలంగాణ భవన్‌లో ఇప్పుడు అంతర్గత సమీక్షల వేడి మామూలుగా లేదు. రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం.. పార్టీలో పేరుకుపోయిన అలసత్వాన్ని వదిలించేందుకు సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధమవుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ‘లాస్ట్ వార్నింగ్’ చూస్తుంటే.. ఈ నెపంతో పార్టీలో ఒక భారీ ప్రక్షాళనకే గ్రౌండ్ సిద్ధమైనట్లు అర్థమవుతోంది.
68 నియోజకవర్గాల్లో అసలు పరీక్ష..
ఎన్నికలు జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల పరిధిలోకి ఆరు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 68 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. సాధారణంగా అభ్యర్థి ఖరారైన తర్వాతే ఎన్నికల హీట్ మొదలవుతుంది. కానీ ఈసారి వ్యూహం మార్చిన అధిష్ఠానం.. అభ్యర్థిని ప్రకటించకుండానే ఓటర్ల నమోదు బాధ్యతను పూర్తిగా అసెంబ్లీ ఇన్‌ఛార్జుల భుజస్కంధాలపై పెట్టింది. "క్షేత్రస్థాయిలో మీ పట్టు ఏంటో నిరూపించుకోండి.. మీ కేడర్ బలం ఏంటో చూపించండి" అంటూ టార్గెట్లు నిర్దేశించింది.
అయితే, పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరిన ఇంటెలిజెన్స్ రిపోర్టులు గులాబీ బాసులను విస్మయానికి గురిచేశాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో దూకుడుగా సాగుతున్నా.. దాదాపు 20 స్థానాల్లో మాత్రం ఇన్‌ఛార్జులు కనీసం స్పందించడం లేదని తేలింది. "ఇది మనకు సంబంధించిన డైరెక్ట్ ఎలక్షన్ కాదు కదా.. మనకెందుకు వచ్చిన తలనొప్పి" అన్నట్లుగా కొందరు సీనియర్లు వ్యవహరించడం కేటీఆర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని సమాచారం.
నవంబర్ 6.. డెడ్‌లైన్ కాదు, ఇన్‌ఛార్జుల భవితవ్యం
ఓటర్ల నమోదుకు నవంబర్ 6 ఆఖరి గడువు. చేతిలో కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే "మా ఆదేశాలను మీరు లైట్ తీసుకుంటే.. రేపు మిమ్మల్ని మేం లైట్ తీసుకుంటాం" అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సాధారణ హెచ్చరిక కాదని, అది ఇన్‌ఛార్జ్ పదవుల నుంచి తప్పించేందుకు వేసిన అల్టిమేటం అని పార్టీ వర్గాలు అంటున్నాయి. గడువు ముగిసిన వెంటనే బూత్‌ల వారీగా లెక్కలు బల్దియా టేబుల్‌పైకి రానున్నాయి. ఎవరు గ్రౌండ్‌లో చెమటోడ్చారు, ఎవరు తప్పించుకు తిరిగారనేది పక్కా డేటాతో బయటపడనుంది.
పాత నేతలకు చెక్.. కొత్త రక్తానికి ఛాన్స్?
నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం కేవలం ఓటర్ల నమోదుకే పరిమితం కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల్లో స్థానికంగా ఉండకుండా హైదరాబాద్‌కే పరిమితమైన నేతలు, కేడర్‌ను గాలికొదిలేసిన ఇన్‌ఛార్జుల జాబితా ఇప్పటికే కేటీఆర్ వద్ద సిద్ధంగా ఉందట. వారిపై చర్యలు తీసుకునేందుకు ఒక తిరుగులేని కారణం కోసం చూస్తున్న నాయకత్వానికి ఈ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు పక్కా ఆయుధంగా మారిందని చెబుతున్నారు.
నవంబర్ 6 నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోని 20 మంది ఇన్‌ఛార్జులను పక్కనబెట్టి, పార్టీ కోసం నిలబడే చురుకైన ద్వితీయ శ్రేణి నేతలకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తోందని సమాచారం. ఈ లెక్కన పట్టభద్రుల పోరు ముగిసేలోపే బీఆర్‌ఎస్‌లో ఊహించని మార్పులు, భారీ ప్రక్షాళన పర్వం షురూ కావడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


