Water War: నల్గొండ-పాలమూరు మధ్య జల వివాదం ముదిరింది. పాలమూరు ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు వ్యవహారం చిచ్చు రాజేసింది. ఈ అంశంపై ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం ఈ చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ తో పాటు కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేశ్ కుమార్ రెడ్డి, మేఘా రెడ్డి మంత్రి ఉత్తమ్ ను కలిశారు.
పాలమూరు నుంచి నీటి తరలింపును ఆపాలి
ఇదే సమావేశానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్గొండ జిల్లా సీనియర్ నేత జానారెడ్డి కూడా హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. దాదాపు గంటన్నరపాటు మంత్రి ఉత్తమ్ తో చర్చించారు. పాలమూరు నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అంశంపై నేతలు తమ అభ్యంతరాలను మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు నుంచి నీటి తరలింపును ఆపాలని ప్రజాప్రతినిధులు మంత్రి ఉత్తమ్ కి విజ్ఞప్తి చేశారు.
ఏదుల నుంచి నీటి తరలింపుతో పాలమూరు ఆయకట్టుకు ఇబ్బందులు
ఏదుల నుంచి నీటిని తీసుకుంటే పాలమూరు ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి ఉత్తమ్ కు వారు వివరించారు. డిండి ప్రాజెక్ట్ కు నీటిని అందించడంపై తమకు వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే పాలమూరు ప్రాంత ప్రయోజనాలకు నష్టం కలగకుండా ప్రత్నామ్యాయ మార్గాల ద్వారా డిండికి నీటిని తరలించాలని కోరారు. అలాగే పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. ఈ అంశంపై అధికారులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరో మార్గంలో డిండికి నీటిని తరలించాలని డిమాండ్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డిండికి.. ఏదుల నుంచి కాకుండా నేరుగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించాలని పాలమూరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతానికి రావాల్సిన నీటిని నల్గొండలోని డిండికి ఎలా తరలిస్తారు? అంటూ పాలమూరు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు ప్రజా సంఘాల నేతలు పాదయాత్రలు, ధర్నాలు చేస్తున్నారు.
సీఎం సూచనతో ఉత్తమ్‌తో సమావేశం
పాలమూరు రైతాంగం ఆందోళనతో అలర్ట్ అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకుని సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఉత్తమ్ ను కలవాల్సిందిగా సీఎం రేవంత్ వారికి సూచించారు. దీంతో మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో నేతలంతా కలిసి ఉత్తమ్ కు కలిశారు. పాలమూరు ప్రాంత సమస్యలను మంత్రికి వివరించారు. ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిండికి ఏదుల నుంచి కాకుండా మరో మార్గంలో నీరివ్వాలని కోరారు.
దుష్ప్రచారం చేస్తున్నారని నల్గొండ జిల్లా నేతల ఆరోపణ
అయితే నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల వాదన మరోలా ఉంది. మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు జీవనాధారమైన డిండి ఎత్తిపోతల పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని నల్గొండ జిల్లాకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళ్లు అందించే పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు వివాదం సృష్టించడం సరికాదని హితవు పలికారు. డిండి నుంచి నీళ్లు వస్తేనే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ రహితంగా మారుతుందన్నది వారి ప్రధాన వాదన.
పాలమూరు రంగారెడ్డి ఆయకట్టుకు తీవ్ర నష్టం
సౌత్ తెలంగాణలో ముఖ్యమైన జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ. ఈ రెండు జిల్లాల మధ్య వాటర్ వార్ పొలిటికల్ హీట్ పెంచింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై భారం పెడితే.. నల్గొండ జిల్లా నేతలంతా కలిసి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ పై భారం పెట్టారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ పాలమూరు-రంగారెడ్డి ఏదుల నుంచి వచ్చే నీళ్లను డిండికి విడుదల చేయడానికి ఒప్పుకోము అని పాలమూరు నేతలు అంటున్నారు. అలా జరిగితే పాలమూరు రంగారెడ్డి ఆయకట్టుకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు. మహబూబ్ నగర్ రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని, కనుక ఏదుల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో డిండికి నీళ్లు తీసుకోవాలన్నది పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల వాదన.
ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
డిండి ప్రాజెక్ట్ అంశంలో ఇటు పాలమూరు, అటు నల్గొండ జిల్లాల నేతలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇరు జిల్లాల ప్రజాప్రతినిధులను ఏ విధంగా కన్విన్స్ చేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.


