National

AI Agents: భారత్‌కు సెర్ట్-ఇన్ రెడ్ అలర్ట్.. మన డేటా సేఫేనా?

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

AI Agents: డిజిటల్ విప్లవంతో భారత్ శరవేగంగా దూసుకుపోతున్న వేళ, దేశ భద్రతకు పెను సవాలుగా మారే ఓ చేదు నిజాన్ని భారత అధికారిక సైబర్ భద్రతా విభాగం ‘సెర్ట్-ఇన్’ బహిర్గతం చేసింది. కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుని హ్యాకింగ్ చేసే సాధారణ కేటుగాళ్ల ముప్పును దాటి, ఇప్పుడు ‘ఏఐ ఏజెంట్లు’ నేరుగా దేశ ఐటీ నెట్‌వర్క్‌లను టార్గెట్ చేస్తున్నాయని హెచ్చరించింది.

AI Agents: డిజిటల్ విప్లవంతో భారత్ శరవేగంగా దూసుకుపోతున్న వేళ, దేశ భద్రతకు పెను సవాలుగా మారే ఓ చేదు నిజాన్ని భారత అధికారిక సైబర్ భద్రతా విభాగం ‘సెర్ట్-ఇన్’ బహిర్గతం చేసింది. కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుని హ్యాకింగ్ చేసే సాధారణ కేటుగాళ్ల ముప్పును దాటి, ఇప్పుడు ‘ఏఐ ఏజెంట్లు’ నేరుగా దేశ ఐటీ నెట్‌వర్క్‌లను టార్గెట్ చేస్తున్నాయని హెచ్చరించింది. పరిశోధన, మూల్యాంకనం కోసం అనుమతించిన కొన్ని ఏఐ ఏజెంట్లు తమ పరిమితులను దాటి భారత కీలక వ్యవస్థల్లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే.. అసలు తమ డేటాబేస్‌ల్లోకి ఏఐ ఏజెంట్లు చొరబడ్డాయన్న విషయాన్ని కూడా ఆయా భారత సంస్థలు గుర్తించలేకపోవడం.

అనుమతుల హద్దులు దాటి..

సెర్ట్-ఇన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓపెన్ సోర్స్ ఏఐ ఆధారిత ఏజెంట్లు భారత ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సమాచార సాంకేతిక వ్యవస్థల్లోకి ఉద్దేశపూర్వకంగా చొరబడ్డాయి. లోపాలను వెతకడం, సమాచారాన్ని సేకరించడం, ఆర్థిక లబ్ధి పొందడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నట్లు తేలింది. సాధారణంగా ఉద్యోగులు ఉపయోగించే ఫైళ్లను కేవలం చదవడానికి మాత్రమే ఇచ్చిన పర్మిషన్లను ఆసరాగా చేసుకుని, సిస్టమ్ అడ్మిన్ తరహాలో ఏఐ ఏజెంట్లు కీలకమైన డేటాను బయటకు పంపే స్థాయికి వెళ్లడం విస్మయం కలిగిస్తోంది.

రోజుకు 7 వేల కేసులు.. రేపటి పరిస్థితి ఏంటి?

భారత్‌లో ఇప్పటికే రోజుకు దాదాపు 7 వేల సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నాయి. మనుషులు నేరుగా ఫోన్లు చేసి ఓటీపీలు అడగడం, నకిలీ లింకులు పంపి ఖాతాలు ఖాళీ చేయడం లాంటి సాధారణ మోసాలకే సామాన్యులు విలవిల్లాడుతున్నారు. అలాంటిది, క్షణాల వ్యవధిలో వేల కంప్యూటర్లలోకి చొరబడగల ఏఐ ఏజెంట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఊహించడానికే భయమేస్తోంది. బాధితులకు సంబంధించిన గత ఈమెయిల్స్, వాయిస్ కాల్స్ శైలిని అచ్చుగుద్దినట్లు అనుకరించి స్థానిక భారతీయ భాషల్లోనే మోసపూరిత ఫిషింగ్ మెసేజ్‌లను ఈ ఏజెంట్లు సృష్టిస్తున్నాయి.

బ్యాంకులు, పవర్ గ్రిడ్లు.. రక్షణ ఎంతవరకు?

ఈ ముప్పు కేవలం ఒక వెబ్‌సైట్‌కో లేదా ఒక కంప్యూటర్‌కో పరిమితం కాదని సెర్ట్-ఇన్ స్పష్టంగా హెచ్చరిస్తోంది. దేశానికి అత్యంత కీలకమైన విద్యుత్ గ్రిడ్లు, బ్యాంకింగ్ నెట్‌వర్కులు, రవాణా వ్యవస్థలు, ఆసుపత్రుల సర్వర్లపై ఏఐ ఏజెంట్లు దాడులు చేస్తే యావత్ ప్రజా జీవనం స్తంభించిపోతుంది. అంతర్జాతీయంగా చూస్తే.. చైనాకు చెందిన ఒకే ఒక్క హ్యాకర్ కేవలం 5 వేల డాలర్ల ఖర్చుతో ఏఐ ఏజెంట్లను ప్రయోగించి వందకు పైగా గ్లోబల్ వెబ్‌సైట్లలోకి చొరబడిన ఉదంతం మనకు కళ్లముందే కనిపిస్తోంది.

పాత భద్రతా పద్ధతులు ఇక పనిచేయవు

సాధారణంగా ఏదైనా దాడి జరిగాక స్పందించే విధానం ఇకపై ఏమాత్రం చెల్లదు. సిస్టమ్స్‌లో యాంటీవైరస్ వేసుకున్నాం, ఫైర్‌వాల్ పెట్టాం అంటే ఏఐ ఏజెంట్ల ముందు ఆ రక్షణలు నిలబడలేవు. ఏఐ ఏజెంట్‌కు కేటాయించిన పనుల మేరకే యాక్సెస్ ఉండాలి తప్ప, కీలకమైన డేటాను మార్చే అధికారాలు ఇవ్వకూడదు. ఏదైనా అనుమానాస్పద కదలిక కనిపించిన మరుక్షణమే ఏఐ కనెక్షన్‌ను ఆటోమేటిక్‌గా కట్ చేసే అత్యవసర డిఫెన్సివ్ టెక్నాలజీని భారత సంస్థలు అభివృద్ధి చేసుకోవాలి.

ఈ ముప్పును అడ్డుకోవడానికి సెర్ట్-ఇన్ ఇప్పటికే అంతర్జాతీయ సైబర్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికైనా మేల్కొని ఏఐ ఏజెంట్లపై కఠిన పర్యవేక్షణ, రక్షణ చర్యలు తీసుకోకపోతే.. దేశ డిజిటల్ భద్రతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

#AI Agents#Artificial Intelligence#CERT-In#CERT-In Alert#India Cybersecurity#AI Cybersecurity Threats#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి