ఏపీలో దారుణం చోటుచేసుకుంది. రూ.20 వాటర్ బాటిల్ కోసం ఓ వ్యక్తిపై దాడి చేసి మరి హత్య చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.మరణానికి ముందు బాధిత వ్యక్తి తనకు పిల్లలు ఉన్నారని, కొట్టొద్దని ఎంత వేడుకున్నా దుండగులు విడిచిపెట్టలేదు. దెబ్బలకు తాళలేక సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకివెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33) పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. వారం క్రితం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి సాయికుమార్ వెళ్లాడు.ఈ నెల 18న అర్ధరాత్రి దాటాక విజయవాడ పడమటలో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాన్‌షాపులోని ఫ్రిజ్ నుంచి రూ.20 వాటర్ బాటిల్ తీసుకునేందుకు సాయికుమార్ యత్నించాడు.
పాలు సరఫరా చేసే వాహనం డ్రైవర్ దానిని గమనించాడు. వెంటనే సాయిని పట్టుకొని పాన్ షాపులో పనిచేసే రవిశంకర్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. దొంగతనం చేస్తావా? అంటూ పిడిగుద్దులు గుద్ది, విచక్షణారహితంగా కొట్టి, నేలపై ఈడ్చుకుంటూ దుకాణానికి వెనుక ఉన్న సందులోకి రవిశంకర్, బార్‌లో పనిచేసే అయ్యప్పశంకర్ తీసుకెళ్లారు.
అటుగా వెళ్తున్న పోతంశెట్టి నవీన్, సాయిప్రణీత్ వారికి జతవ్వగా నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.భార్యాపిల్లలున్నారని.. తనను విడిచిపెట్టాలని వేడుకున్నా కనికరించలేదని తెలిసింది. చేతులను వెనక్కి విరిచి విద్యుత్తు స్తంభానికి కట్టేసి, కర్రలతో తీవ్రంగా కొట్టి 2 గంటల పాటు నరకయాతన పెట్టడంతో సాయికుమార్ మృతి చెందాడు. దాడి చేసిన నలుగురు పరారవ్వగా, సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.


