Telangana Congress: బాగా వేడిగా ఉన్నప్పుడే ఇనుమును కావాల్సిన రూపంలోకి మలుచుకోవాలి.. అలాగే అవసరం ఉన్నప్పుడే అందించే సహాయానికైనా, ఇచ్చే పదవికైనా విలువుంటుంది. సరిగ్గా సమయానికి ఆ గుర్తింపు దక్కకపోతే ఎంత పెద్ద పదవి ఇచ్చినా ఆ మజా ఉండదు. సరిగ్గా ఇప్పుడిదే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో సొంత ప్రభుత్వం కొలువుదీరి ఇన్ని నెలలవుతున్నా, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీ విషయంలో అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు నేతల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ఎదురుచూసి చూసి కళ్లు కాయలు కాసి, ఆ కాయలు పళ్లై రాలిపోయే పరిస్థితి వచ్చిందంటూ హస్తం పార్టీ కేడర్ లోలోపల రగిలిపోతున్నారు.
డెడ్‌లైన్లకే డెడ్‌లైన్లు..
ప్రతి పండగ వచ్చినప్పుడల్లా అధిష్ఠానం నుంచి ఒకటే మాట వినిపిస్తోంది.. "ఇదిగో పండగ గిఫ్ట్‌గా పోస్టుల లిస్ట్ వస్తోంది.. కార్యకర్తలు పండగ చేసుకోవచ్చు" అని చెప్పడం, తీరా పండగ ముగిశాక చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. మంచి రోజులు, ముహూర్తాలంటూ కాలం గడిపేశారు. తాజాగా దసరా కూడా వెళ్లిపోయింది కానీ పదవుల భర్తీపై ఎలాంటి ముందడుగూ పడలేదు. ఇప్పుడు కొత్తగా నవంబర్ మొదటి వారం అంటూ మరో గడువు తెరపైకి తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ తర్వాత ఈ విషయంపై చర్చ జరిగిందని చెబుతున్నా, ఆశావహుల్లో మాత్రం ఏమాత్రం నమ్మకం కలగడం లేదు. "ఈసారైనా ప్రకటిస్తారా? లేక మళ్లీ ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తారా?" అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో బలంగా ఉన్నాయి. ఈసారీ తేల్చకపోతే నాయకులు, కేడర్ పార్టీ నాయకత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
అధికారం చేతిలో ఉండి కూడా ఎందుకీ తాత్సారం?
చేతిలో సొంత అధికారం ఉంది.. పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లు కట్టబెట్టే పూర్తి వెసులుబాటు ఉంది. అయినా సరే నాయకత్వం ఎందుకు ఇంతగా నాన్చుతోందనేది క్షేత్రస్థాయి నేతల ప్రశ్న. కొత్తగా పదవులు ఇవ్వడం అటుంచితే, గతంలో నియమించిన వారి పదవీకాలం ముగిసి రెన్యూవల్ కోసం చూస్తున్న వారి విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇచ్చేదేదో సరైన సమయానికి ఇస్తే నాయకుల్లో పనిచేయాలన్న ఉత్సాహం ఉంటుంది. కానీ, ఆశలన్నీ ఆవిరైపోయి చిరాకు పరాకాష్టకు చేరాక తీరిగ్గా కుర్చీలో కూర్చోబెడితే ఆ పదవికి ఏం విలువ ఉంటుందని నాయకులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
నాయకుల అసంతృప్తి ముదరకముందే తేల్చాలి..
ఎలాగూ ఇవ్వాల్సిన పదవులు ఇస్తున్నప్పుడు.. నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యే వరకు విషయాన్ని ఎందుకు సాగదీయాలన్నదే అసలు సమస్య. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ ముందు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం.. అవి రచ్చ రచ్చ అయ్యాక తలపట్టుకుని మళ్లీ వెనక్కి తగ్గడం కంటే, ముందే పక్కా హోమ్‌వర్క్‌తో అడుగులు వేస్తే చిక్కులే ఉండవు కదా అన్న అసహనం అంతర్గత సమావేశాల్లో వినిపిస్తోంది. ఆశావహులకు పూర్తిగా విరక్తి వచ్చే వరకు వేచి చూడకుండా, అనుకున్న వెంటనే నామినేటెడ్ పదవుల పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్నది గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతున్న హాట్ టాక్.


