రాష్ట్రంలో ఉద్యోగాల పేరిట కొందరు అధికారులు భారీ అవినీతికి తెరలేపారు.జాబ్ కావాలంటే రూ. లక్షలు చెల్లించాలని కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఉద్యోగానికి ఇంత చొప్పున అంటూ రేట్ కూడా ఫిక్స్ చేశారు. మెరిట్ లిస్టును పక్కన పడేసి డబ్బులు ఎవరు ఇస్తే వారికే జాబ్ అంటూ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. వైద్యారోగ్యశాఖలో ఈ వ్యవహారం బయట పడగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగాల కోసం కష్టపడి చదివిన అభ్యర్థుల భవిష్యత్ ప్రస్తుతం గందరగోళంగా మారింది.
మెదక్ జిల్లా పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)లో 64 కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో అర్హులురెండు వేలకు పైగా మంది దరఖాస్తులు చేసుకున్నారు. మెరిట్ లిస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంటుంది.కానీ, కొందరు దళారులు కొత్త దందాకు తెరలేపారు. ఉద్యోగం కావాలా? అయితే రూ.లక్షలు ఇవ్వాల్సిందే అని అభ్యర్థులను డిమాండ్ చేసినట్టు సమాచారం.
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండదండలతో దళారులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలు రేట్ ఫిక్స్ చేసి మరీ డబ్బులు దండుకుంటున్నట్టు సమాచారం. మంత్రి పేరు చెప్పి భారీగా అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మెరిట్ లిస్టు ఆధారంగా కాకుండా కేవలం డబ్బులు ఇచ్చిన వారికి జాబ్స్ ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
దీంతో అర్హత ఉన్నా డబ్బులు చెల్లించకపోతే ఉద్యోగం రాదేమో అని అభ్యర్థులు భయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం,సంబంధిత మంత్రి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు. కష్టపడి చదివిన తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా డబ్బులకు అమ్ముకోవడం సరికాదంటూ మండిపడుతున్నారు.కాగా, వైద్యారోగ్య శాఖలో పైసలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్న విషయం మంత్రికి తెలిసే జరుగుతుందా? లేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.


