మైనర్లపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో పేరెంట్స్ బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఆడపిల్లను ఇంట్లో నుంచి బయటకు ఒంటరిగా పంపేందుకు భయపడుతున్నారు.ఎటునుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందో అని టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియా యుగంలో అశ్లీలత పెరిగిపోవడమే అఘాయిత్యాలకు కారణమని తెలుస్తోంది. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా, నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా వేధింపులు, లైంగికదాడులు అస్సలు ఆగడం లేదు.
తాజాగా ఓ మైనర్ బాలికను వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి రేప్ చేసి చంపేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోని మార్దు గ్రామంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. భగవత్ మెహతో(23) అనే యువకుడు నదిలో స్నానం చేద్దామని చెప్పి 17 ఏళ్ల మైనర్ బాలికను పిలిచాడు. ఐదు నిమిషాల్లో తిరిగి వస్తానని ఇంట్లో చెప్పి భగవత్ వద్దకు బాలిక వెళ్లింది. అతను నది వద్దకు కాకుండా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆపై ఈ విషయం ఎవరికైనా చెప్తుందన్న భయంతో బాలికను దారుణంగా హతమార్చాడు.అనంతరం ఏమీ ఎరుగనట్టు ఘటనా స్థలం నుంచి మెహతో వెళ్లిపోయాడు. మరోవైపు, కుమార్తె సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సాయంతో చుట్టూ వెతకడం ప్రారంభించారు.
ఎంత వెతికినా జాడ దొరక్కపోవడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా చెట్ల పొదల్లో బాలిక మృతదేహం లభ్యమైంది. అనంతరం కేసు ఫైల్ చేసి విచారణ చేపట్టగా ఈ హత్యకు పాల్పడింది భగవత్ మెహతోనే అని తేల్చారు.అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా, తమ కూతురిని చంపిన వాడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


