సెప్టెంబర్ నాటికి 47 శాతం పెరిగిన దిగుమతి బిల్లు
85 శాతానికి పైగా విదేశీ దిగుమతులపైనే భారత్ ఆధారం
త్వరలోనే దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు భయం?
ప్రత్యామ్నాయ మార్గమేంటి?
పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారం.. సామాన్యులపై తీవ్ర ప్రభావం
అంతర్జాతీయ విఫణిలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ (Petrol and Diesel Prices) ధరల పెంపు మళ్లీ వాహనదారులను కలవరపెడుతోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ సంక్షోభం, సౌదీ అరేబియా ఆయిల్ క్షేత్రాలపై దాడుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. సెప్టెంబర్ 2026 నాటికి దేశ ముడి చమురు దిగుమతి బిల్లు ఏకంగా 47 శాతం పెరిగి 15.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.45 లక్షల కోట్లు) చేరుకున్నట్లు కేంద్ర పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గత ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయంగా క్రూడ్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు 69.61 డాలర్లుగా ఉండగా, ప్రస్తుత సంక్షోభం కారణంగా అది ఏకంగా 116.09 డాలర్లకు ఎగబాకడం దిగుమతి భారాన్ని భారీగా పెంచింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85 శాతానికి పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుండటం గమనార్హం. మొత్తం దిగుమతుల్లో ఒక్క రష్యా వాటానే 35 శాతం ఉండగా, ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల నుంచి మిగతా సరఫరా జరుగుతోంది. అక్టోబర్ చివరి వారంలోనూ బ్రెంట్ క్రూడ్ ధరలు 110 డాలర్లు దాటి ట్రేడ్ అవుతుండటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై శుద్ధి వ్యయం విపరీతంగా పెరిగింది.
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?
ఈ భారీ దిగుమతి బిల్లుల పెంపు దేశ వాణిజ్య లోటును మరింత పెంచడంతో పాటు, యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను తీవ్రంగా బలహీనపరుస్తోంది. ఈ పరిణామాల కారణంగా త్వరలోనే దేశీయ మార్కెట్లో ఇంధన రేట్లను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రూడ్ ధరలు పెరిగితే రవాణా, తయారీ రంగాల ఖర్చులు అమాంతం పెరిగిపోయి, నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉంది.
ఇంధన వనరులు, ఈవీల వాడకమే ఏకైక మార్గం
సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన ద్రవ్యోల్బణ భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి దీర్ఘకాలంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి వాహనదారుడు ఇంధన వినియోగం విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.


