భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న తీరు, ఆయన దౌత్య విధానాలపై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (Donald Tusk) ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ వేదికలపై నరేంద్ర మోదీని తన అత్యంత సన్నిహిత స్నేహితుడిగా చెప్పుకోవడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా న్యూఢిల్లీకి చేరుకున్న డొనాల్డ్ టస్క్, గురువారం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీ అనంతరం నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పోలాండ్ ప్రధాని, భారత్‌తో తమ దేశానికి అత్యంత బలమైన, సానుకూల సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్య ప్రయోజనాల సంఘర్షణ ఉన్నప్పటికీ, భారత్-పోలాండ్ దేశాల మధ్య ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకు తావులేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారంలోనూ, ప్రపంచ శాంతి నెలకొల్పడంలోనూ భారత్ వహిస్తున్న క్రియాశీల పాత్రను, మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇరు దేశాల నేతల మధ్య జరిగిన ఈ కీలక భేటీలో వాణిజ్యం, రక్షణ, అంతరిక్ష సాంకేతికత, డిజిటల్ నెట్వర్కింగ్, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. 'కో-డెవలప్మెంట్, కో-ప్రొడక్షన్' విధానంలో భారత రక్షణ ఉత్పత్తుల తయారీలో భాగస్వాములు కావాలని పోలాండ్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్-యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వేగవంతం కావడానికి పోలాండ్ పూర్తి మద్దతు ఉంటుందని టస్క్ హామీ ఇచ్చారు.
ఈ పర్యటన ద్వారా భారత్ - పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుకుందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న పోలాండ్ ప్రధానమంత్రి స్వయంగా భారత్‌ను సందర్శించి, ప్రధాని మోదీ నాయకత్వాన్ని, స్నేహాన్ని ప్రశంసించడం ప్రపంచ దౌత్య రంగాన భారత్ పెరుగుతోన్న ప్రాముఖ్యతకు అద్దం పడుతోంది.


