కుటుంబం అన్నాక చిన్నా చితక గొడవలు కామన్. కొందరు వాటిని బయటకు రానివ్వరు. ఇంట్లోనే పెద్దల సమక్షంలో సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్కోసారి పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతుంటాయి. ఆస్తి తగాదాలు, భార్యభర్తల పంచాయితీలు, వరకట్న సమస్యలు, అత్తమామ వేధింపులు ఇవే మేజర్ కారణాలు.. ఇటీవల భార్యలు వేధిస్తున్నారని కొందరు భర్తలు కేసులు పెడుతున్నారు. అయితే, తాజాగా వెలుగుచూసిన ఓ కుటుంబ గొడవ చాలా వింతగా ఉంది.
వివరాల్లోకివెళితే.. భార్యా భర్తలైన విజయ్ కుమార్, సౌమ్య హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే,కొన్నాళ్లుగా భర్త ఉద్యోగం చేయకుండా తన బంగారు ఆభరణాలు తీసుకున్నాడని భార్య ప్రధానంగా ఆరోపణలు చేసింది.ఆస్తి పత్రాల తీసుకోవడంతో పాటు తన పేరుపై రుణాలు తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సౌమ్య ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే ఈ నెల 20న ఇంట్లో వివాదం జరగ్గా తన మరిది సురేశ్ కుమార్ తన చేతులు, కాళ్లపై కొరికాడని సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.తనని చంపుతానని కూడా సురేశ్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సౌమ్య పేర్కొన్నది.ఇదిలాఉండగా, కుటుంబ వివాదంలో తనపై దాడి చేశారని తన వదిన సౌమ్యపై పోలీసులకు సురేష్ కుమార్ ఫిర్యాదు చేశాడు.పరస్పర ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ గొడవలు జరిగాయని పోలీసులు నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన సౌమ్య, సురేష్ కుమార్ వాయిస్ విన్నాక ఎవరివైపు న్యాయం ఉందో వారికి పక్షాన పోలీసులు తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా, వదిన తన మరిది మీద చేసిన ఆరోపణలపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి ఫిర్యాదులు కూడా ఇస్తారా? అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.


