National

CJP: అనుభవలేమా? ప్లాన్-బి లేదా? సిజేపీకి దిక్కుతోచని స్థితి!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

CJP: దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనలతో యువతను ఏకం చేసి, సరికొత్త సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ)కి అసలు సిసలైన రాజకీయ వాస్తవాలు ఇప్పుడు బోధపడుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రెండ్ చేయడం వేరు..

CJP: దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనలతో యువతను ఏకం చేసి, సరికొత్త సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ)కి అసలు సిసలైన రాజకీయ వాస్తవాలు ఇప్పుడు బోధపడుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రెండ్ చేయడం వేరు.. వ్యవస్థలను ఎదుర్కొంటూ గ్రౌండ్‌లో నిలబడి పోరాటం నడపడం వేరన్న పచ్చి నిజాన్ని ఆ పార్టీ నాయకత్వం ఆలస్యంగా గుర్తించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌మంతర్ వేదికగా చేపట్టిన రెండో విడత ఆందోళనల్లో ఆ పార్టీ వేసిన తప్పటడుగులు, వ్యూహాత్మక లోపాలు ఇప్పుడు ఉద్యమాన్నే డైలమాలో పడేశాయి.

పక్కా ప్లానింగ్ లేదు.. ‘ప్లాన్-బి’ అసలే లేదు!

ఏదైనా ఒక భారీ నిరసనకు పిలుపునిచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయో ఊహించడం రాజకీయాల్లో కనీస ప్రాథమిక సూత్రం. కానీ సిజేపీ నాయకత్వంలో ఆ ముందుచూపు మచ్చుకైనా కనిపించలేదు. ఢిల్లీలో భారీగా పోలీసుల మోహరింపు జరుగుతుందని తెలిసినా.. పోలీసులు అడ్డుకుంటే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? జంతర్‌మంతర్‌కు అనుమతి నిరాకరిస్తే ఎక్కడికి తరలాలి? అనే కనీస 'ప్లాన్-బి'ని వీరు సిద్ధం చేసుకోలేదు. ఫలితంగా, పోలీసులు ఆంక్షలు విధించగానే మొత్తం ప్లాన్ పేకమేడలా కూలిపోయింది.

ఫ్లైట్ డీటెయిల్స్ బయటపెట్టి.. స్వయంగా బుక్కయ్యారు

సిజేపీ చేసిన మరో అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం.. ఆందోళన జరిగే అక్టోబర్ 10వ తేదీనే కీలక నేతలు ప్రయాణం పెట్టుకోవడం. అంతటితో ఆగకుండా తమ విమాన ప్రయాణ వివరాలను కూడా ముందుగానే సోషల్ మీడియాలో బయటపెట్టారు. ఇంకేముంది.. పోలీసులు నేరుగా ఫ్లైట్ వద్దకే వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. సమరానికి దిగే రోజే లీడర్లు చేతికి చిక్కితే ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తారు? గ్రౌండ్‌లో జనం తరలివచ్చినా వారిని లీడ్ చేసే నాథుడు లేకపోవడంతో, చివరకు ఆ ఆందోళన పగ్గాలను లెఫ్ట్ విద్యార్థి సంఘాలు తమ చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కీలక నేతలు జైలుకు.. ఒంటరైన అభిజీత్ దీప్కే

పార్టీని ముందుండి నడిపించే ముగ్గురు ప్రధాన నేతల్లో ఇద్దరు కో-కన్వీనర్లు సౌరభ్ దాస్, అశుతోష్ రంకా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు అధినేత అభిజీత్ దీప్కే ఢిల్లీని వీడి మహారాష్ట్రకు వెళ్లాల్సి వచ్చింది. లీగల్ పోరాటంలోనూ సిజేపీ అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. అరెస్ట్ అయిన తమ నేతలను విడిపించేందుకు వెంటనే హైకోర్టును ఆశ్రయించకుండా విలువైన సమయాన్ని వృథా చేశారన్న విమర్శలు న్యాయ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియా క్రౌడ్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ (ట్విట్టర్) ట్రెండ్స్ చూసి రాజకీయ ఉద్యమాలు సాధ్యం కావని ఈ ఘటన నిరూపించింది. సాంప్రదాయ పద్ధతుల్లో క్యాడర్‌ను సమీకరించే వ్యవస్థ, క్షేత్రస్థాయి సమన్వయం లేకపోవడమే సిజేపీని దెబ్బతీసింది. విద్యార్థి సంఘాలు వీరి అనుభవలేమిని సానుభూతితో చూస్తూ అండగా ఉంటామని చెబుతున్నప్పటికీ.. వ్యూహాలు మార్చుకోకపోతే మాత్రం, సంచలనంగా పుట్టుకొచ్చిన ఈ ‘జెన్-జీ’ పార్టీ చివరికి సోషల్ మీడియా లైకులు, కామెంట్లకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

#Cockroach Janata Party#CJP#Cockroach Janata Party News#CJP Protest#NEET Protests#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి