Harish Rao: రాష్ట్రంలో వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని మాజీమంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు సాయం చేయాలన్నారు. ఇక చివరి దశలో ఉన్న పంటలకు సాగునీటిని, నాణ్యమైన కరెంటును అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరుఫున డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు.
అధికారులను సస్పెండ్ చేస్తే రైతుల కష్టాలు తీరతాయా?
రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మాట్లాడి కోల్ ఇండియా నుంచి బొగ్గు తెచ్చుకుని ఉంటే పంటలు ఎండిపోవు కదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రకృతి వల్ల జరిగిన నష్టం తక్కువ.. కాంగ్రెస్ వైఫల్యం వల్ల జరిగిన నష్టం ఎక్కువ అని విమర్శించారు. ఏమన్నా అంటే అధికారులను సస్పెండ్ చేస్తా అని సీఎం రేవంత్ అంటున్నారు.. అది కరెక్ట్ కాదు. అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన రైతుల కష్టాలు తీరవు కదా? అని హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంతో 12లక్షల ఎకరాలు ఎండిపోయాయి
రేవంత్ సర్కార్ ఇప్పటివరకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల, ముందు జాగ్రత్త పడకపోవడం వల్ల 12లక్షల ఎకరాలు ఎండిపోయాయని హరీశ్ రావు ఆరోపించారు. కనీసం ఈ 20 రోజులన్నా పంటలను కాపాడేలా చర్యలు చేపట్టాలన్నారు. 20, 30 రోజులన్నా సరిగ్గా పంటలను కాపాడితే ఇంకో 10, 20లక్షల ఎకరాలన్నా ఎండకుండా కాపాడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటే ఇంకో 10, 20 లక్షల ఎకరాల పంట కాపాడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పత్తి రైతులు ఆందోళనలో ఉన్నారు
పెట్టుబడి రాక పత్తి రైతులు ఆందోళనలో ఉన్నారని హరీశ్ రావు వాపోయారు. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో పత్తి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వాళ్లని ఎలా ఆదుకుంటారు? 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వారిని ఎలా ఆదుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగారు హరీశ్ రావు.
కేసీఆర్ రైతులకు అండగా నిలిస్తే.. రేవంత్ శిక్షిస్తున్నారు
''నాడు కరోనా విపత్తు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలకు రక్షణ కవచంలా నిలబడితే.. నేడు ఎల్నినో వస్తే రేవంత్ రెడ్డి ప్రజలను శిక్షిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలు భయపడకుండా కేసీఆర్ ధైర్యం చెప్పారు. కష్టకాలంలోనూ రైతులకు నిరంతర కరెంటు, సాగునీరు ఇచ్చి విశాఖపట్నం పోర్టులో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి యూరియా తెప్పించారు. బీహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో హమాలీలను రప్పించి కోటి టన్నుల పంట పండించారు.
కానీ రేవంత్ రెడ్డి మాత్రం "పైసలు పెడితే నీళ్లు దొరుకుతాయా?" అంటూ ఉచిత డైలాగులు కొడుతూ ఎల్నినో పేరిట క్రాప్ హాలిడే ప్రకటించి చేతులెత్తేశారు'' అని విరుచుకుపడ్డారు హరీశ్ రావు. కాంగ్రెస్ పాలనలో కరెంటు సరిగ్గా లేక, లో వోల్టేజ్ తో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని హరీశ్ రావు తెలిపారు.


