BRS: కాంగ్రెస్ నేతలు, వారి కుటుంబసభ్యుల భూములపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. భూములపై విచారణ జరిపేందుకు వేసిన కమిటీలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల భూముల గురించి విచారణ జరపాలన్నారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుకు లేఖ రాశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ నాయకుల ఆస్తుల వివరాలకు సంబంధించిన ఆధారాలను సైతం లేఖకు జత చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే కక్షతో
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. జీవో నెంబర్ 134 రాజ్యాంగానికి, ఆర్టికల్ 14కు పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ఈ దేశంలో అందరికీ సమానత్వపు హక్కు ఉందని తేల్చి చెప్పారు. ఇక్కడ పెట్టిన భూములన్నీ బీఆర్‌ఎస్ నాయకులవే అని చెప్పారు. సమస్యలపై పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే కక్షతో ఆర్టికల్ 14ను ఉల్లంఘించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
సీఎం కూతురికి రూ.80 కోట్ల భూమిని రూ.10 కోట్లకే ఇచ్చారు
అటెన్షన్ డైవర్షన్ లో సీఎం రేవంత్ దిట్ట అని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకమన్న ఆయన.. బీఆర్ఎస్ నేతల భూములను మాత్రమే జీవో నెంబర్ 134 కింద పెట్టారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ కుమార్తెకు రూ.80 కోట్ల భూమిని రూ.10 కోట్లకే ఇచ్చారని ఆయన ఆరోపించారు. సీఎం కుటుంబమే స్టాంప్ డ్యూటీ ఎగ్గొడితే ఎలా అని ప్రశ్నించారు. వట్టి నాగులపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 27 ఎకరాల భూమి ఉందన్నారు. నానక్ రామ్ గూడ, పుప్పాలగూడలో పొంగులేటి కుటుంబసభ్యులకు భూములు ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ నేతల భూములపై విచారణ జరిపించాలి
''ప్రతీకారంతోనే బీఆర్ఎస్ నేతల భూములపై సీఎం రేవంత్ విచారణకు ఆదేశించారు. సంబంధం లేని భూములను కూడా వివాదంలోకి లాగేలా కుట్ర చేశారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములపై విచారణ చేయించాలి. కాంగ్రెస్ నేతలు, వారి కుటుంబసభ్యుల భూములపైనా విచారణ చేయాలి. కాంగ్రెస్ నేతల భూములపై విచారణ జరపాలని కోరుతూ సీఎస్ కు లేఖ రాస్తున్నా. సీఎస్ కు ఆధారాలు కూడా పంపుతున్నా. కాంగ్రెస్ నేతల భూములపై విచారణ చేయకపోతే అన్ని రకాలుగా పోరాడతాము'' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఎల్ నినోను ఎదుర్కోవడంపై రేవంత్ సర్కార్ సన్నద్ధం కాలేదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రైతుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సీఎం రేవంత్, ఆయన కుటుంబసభ్యుల భూముల వివరాలు ఇవే..! - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గోపనపల్లిలో 127 సర్వే నెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డికి భూములు ఉన్నాయి
రేవంత్ రెడ్డి సతీమణికి భువనగిరి యాదాద్రి చౌటుప్పల్ లో 107 ఎకరాల భూములు ఉన్నాయి
నైమిషా రెడ్డికి నాగర్ కర్నూలు వెల్దండలో 128 ఎకరాల భూములు ఉన్నాయి
తిరుపతి రెడ్డికి నారాయణపేట జిల్లా కోస్గిలో భూములు ఉన్నాయి
నైమిషా రెడ్డికి కుత్బుల్లాపూర్ లో 2 ఎకరాల భూములున్నాయి
80 కోట్ల విలువైన భూమిని కేవలం 10 కోట్లకే కొనుగోలు చేసి అండర్ వాల్యూ చేశారు
స్టాంప్ డ్యూటీ కేవలం 58 లక్షలు కట్టారు
కొండల్ రెడ్డికి వెల్దండ, కొండారెడ్డిపల్లిలో భూములు ఉన్నాయి
సర్వే నెంబర్ 613లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కంపెనీల పేరు మీద 373 ఎకరాల భూములున్నాయి. దాని మీద విచారణ జరిపించాలి
పొంగులేటి హర్షా రెడ్డికి నార్సింగి మున్సిపాలిటీ వట్టి నాగులపల్లిలో సర్వే నెంబర్ 245 259లో 27 ఎకరాల భూములున్నాయి.


