Singareni: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాభాల వాటా ప్రకటించింది. గత ఏడాదిలానే ఈసారి కూడా పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34శాతం వాటా ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.1,53,912 బోనస్ అందనుంది. అటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా గతంలో మాదిరి ఈసారి కూడా 5,500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది సింగరేణికి రూ.1,754 కోట్ల లాభాలు వచ్చాయి. సింగరేణిలో పర్మినెంట్ కార్మికుల సంఖ్య 38వేలు కాగా కాంట్రాక్ట్ వర్కర్ల సంఖ్య 30వేలు.
సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలకు పరిష్కారం
సింగరేణి కార్మికులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై చర్చించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డిపెండెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, త్వరలోనే వారందరరినీ క్రమబద్దీకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మారు పేర్ల సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు.
డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో త్వరలో ఆర్డర్స్
ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 300 వరకు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో 15 రోజుల్లో ఆర్డర్స్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాగే మారుపేర్ల అంశానికి సంబంధించి 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. సింగరేణి పరిధిలోని ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు.
కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం
ఇక కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన వారికి సింగరేణి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. మైనింగ్ లేని చోట లేఅవుట్ చేసి ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. నెహ్రూ హౌసింగ్ కాలనీ పేరుతో ఇళ్లు నిర్మిస్తామన్నారు భట్టి విక్రమార్క. ఇక రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించామన్నారు.
బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్లే లాభాలు తగ్గాయి
సింగరేణికి లాభాలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి బొగ్గు కంటే తక్కువ ధరకు బయటి కంపెనీలు బొగ్గు అమ్ముతున్నాయన్నారు. దీంతో సింగరేణి కూడా బొగ్గు ధరలు తగ్గించిందన్నారు. ఈ కారణంగానే లాభాలు తగ్గాయని వివరించారు. సింగరేణికి బీఆర్ఎస్ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్లే సింగరేణికి లాభాలు తగ్గాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 140 కోల్ బ్లాక్స్ వేలం జరిగితే.. సింగరేణి ఒక్క వేలంలో కూడా పాల్గొనలేదన్నారు.


