రాష్ట్రంలో మరో ఎలివేటెడ్ కారిడార్ రాబోతున్నది. ఇప్పటికే జేబీఎస్ నుంచి షామీర్ పేట మార్గంలో ఎలివేడెట్ కారిడార్‌కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ అడ్డుగా ఉన్న భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.తాజాగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నగరవాసులకు శుభవార్త చెప్పారు. ఎల్‌బీనగర్-హయత్ నగర్ మార్గంలో మరో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయిన కోమటిరెడ్డి.. తెలంగాణలో కీలకమైన మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి చేసిన వినతులపై స్పందించిన కేంద్రమంత్రి పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నివారణకు అత్యంత కీలకమైన ‘ఎల్బీనగర్ - హయత్ నగర్’ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.
అదేవిధంగా కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ‘ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి’ శంకుస్థాపన ప్రతిపాదనకూ ఆమోదం తెలిపారు. NH 167కే పై ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా తెలంగాణ -ఏపీ రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరగడమే కాకుండా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. దాంతో పాటు పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్-శ్రీశైలం NH 765 మీద ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు వినతిపై స్పందించిన కేంద్రమంత్రి.. వెంటనే నూతన డీపీఆర్ (DPR) సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
‘పర్వతమాల’స్కీం కింద రాష్ట్రంలో 5 రోప్ వేల నిర్మాణానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల రాజధానులను అనుసంధానించే ‘హైదరాబాద్- అమరావతి’ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ ప్రతిపాదనపైనా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.‘సేతు బంధన్’ పథకం కింద 3 ఆర్డీఓబీ (ROB)లకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 34 పనులకు సీఆర్ఎస్ఐఎఫ్ (CRIF) నిధులు ఇవ్వాలని మంత్రి కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించారు.
పుల్లూరు - అలంపూర్, జట్రపోలు పెంట్లవెల్లి - కొల్లాపూర్ - లింగాల- అచ్చంపేట నుంచి దేవరకొండ మల్లేపల్లి నల్గొండ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలన్న విజ్ఞప్తిపైనా గడ్కరీ సానుకూలంగా స్పందించారు. నవంబర్ 19 నుంచి 22 వరకు నగరంలో వైభవంగా జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) సదస్సుకు హాజరుకావాలని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కేంద్రమంత్రిని ఆహ్వానించగా.. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.


