తెలంగాణ

BRS : పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేయాలి : హరీశ్ రావు

రచన: Kumar••7 నిమిషాల పఠనం

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం తెచ్చిన అవినీతిమయమైన పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే స్థానిక వెండర్ల ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం తెచ్చిన అవినీతిమయమైన పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే స్థానిక వెండర్ల ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకుని, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ (DPC) ద్వారా స్థానిక వెండర్లకే నిత్యావసర సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలని కోరారు. పాత విధానాన్ని కొనసాగించడం ద్వారా జీవనోపాధి కోల్పోతున్న వేలమంది చిరు వ్యాపార కుటుంబాల భవిష్యత్తును కాపాడటంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన, తాజా సరుకులు అందుతాయన్నారు.

అధిక ధరకు కాంట్రాక్టు ఇచ్చినా సరుకులేవి?

ప్రభుత్వ పెద్దల కమీషన్ల కోసం బ్లాక్‌లిస్ట్ సంస్థకు టెండర్ కట్టబెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు ఇస్తూ జిల్లాకు రూ. 2 కోట్ల చొప్పున రూ. 66 కోట్ల గుడ్‌విల్, బిల్లుల్లో ప్రతినెలా 20 శాతం కమీషన్లు నొక్కేస్తూ పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారని ఫైర్ అయ్యారు. లోకల్ వెండర్లు ఇచ్చే ధరల కంటే 35 నుంచి 45 శాతం అధిక ధరకు కాంట్రాక్ట్ ఖరారు చేసినా నేటికీ హాస్టళ్లకు సరుకులు ఇవ్వలేని చేతకానితనం కాంగ్రెస్ సర్కార్‌ పార్టీదని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి మూడు నెలల్లోనే విఫలమై రద్దయిన విధానాన్ని ఎవరి స్వలాభం కోసం తెలంగాణలో రుద్దుతున్నారు?అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఈ టెండర్లను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించకపోతే, బాధిత కుటుంబాలు, విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావును కలిసి ప్రభుత్వం మార్చిన టెండర్ నిబంధనల వల్ల వేలమంది స్థానిక వెండర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు.

కాంగ్రెస్ కమీషన్ల దందా..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గురుకులాలను చిన్నచూపు చూస్తూ పేద విద్యార్థులకు పెట్టే భోజనంపై కూడా కక్కుర్తి పడుతూ రూ.800 కోట్ల టెండర్లలో కమీషన్ల దందా నడుపుతోందని ధ్వజమెత్తారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫాంలు,నోట్ బుక్కులు,ట్రంక్ పెట్టెల ఇతర వస్తువుల కొనుగోళ్ల టెండర్లలో దాదాపు రూ. 2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని గతంలోనే తాము ఆధారాలతో సహా నిరూపించామన్నారు. ఇప్పుడు పేద విద్యార్థుల కడుపునింపే నిత్యావసర సరుకులపైనా 20 శాతం కమీషన్లు దండుకోవాలని చూడడం వీరి కక్కుర్తికి నిదర్శనం అని మండిపడ్డారు.

బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు కాంట్రాక్టా?

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,023 గురుకులాలు, 3 వేలకు పైగా సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గతంలో పాఠశాలను యూనిట్‌గా తీసుకుని స్థానిక వ్యాపారులు సరుకులు సరఫరా చేసేవారని గుర్తుచేశారు. స్థానిక వెండర్లను తప్పించేందుకు జీవో 17 పేరుతో మొదట జిల్లా యూనిట్ అని, ఆ తర్వాత రూ.3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల భారీ ఈఎండీలు పెట్టి వారిని పోటీ లేకుండా చేశారని ఆక్షేపించారు.

వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించినా లెక్కచేయకుండా, ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా చేసి ‘పీఎంయూ’ విధానం ద్వారా రూ.800 కోట్ల కాంట్రాక్టును ఒకే వ్యక్తికి, అదీ గతంలో బ్లాక్‌లిస్టులో పెట్టిన సంస్థకు అప్పగించడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు.గతంలో నిబంధనల ఉల్లంఘన కారణంగా తెలంగాణ సివిల్ సప్లైస్‌లో రూ.65 కోట్ల డిపాజిట్ జప్తునకు గురై బ్లాక్‌లిస్టులో ఉన్న నాకాఫ్ సంస్థకు, అలాగే ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నిషేధానికి గురైన కంపెనీకి ఈ టెండర్‌ను ఎలా కట్టబెడతారని హరీశ్ రావు ప్రశ్నించారు.

#Harish rao#PMU tenders#Telangana#congress government#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి