తెలంగాణ

Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక హీట్.. బీఆర్ఎస్ అభ్యర్థి ఇతనేనా?

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికల నగారా మోగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఇక్కడ బై-పోల్ అనివార్యమైంది. దీంతో తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో గులాబీ దళం అప్పుడే మైదానంలోకి దిగింది.

Khairatabad Bypoll: హైదరాబాద్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికల నగారా మోగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఇక్కడ బై-పోల్ అనివార్యమైంది. దీంతో తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో గులాబీ దళం అప్పుడే మైదానంలోకి దిగింది. ఆశావహుల జాబితా పెద్దదే ఉన్నప్పటికీ.. అధిష్టానం మాత్రం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి వైపే పూర్తి మొగ్గు చూపినట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

మన్నె వైపే కేసీఆర్ మొగ్గు

ఖైరతాబాద్‌లో టికెట్ రేసులో పలువురు సీనియర్లు ఉన్నా.. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల ఆశీస్సులు మన్నె గోవర్ధన్ రెడ్డికే బలంగా ఉన్నాయన్నది పార్టీ నాయకుల టాక్. గతంలో రెండుసార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనా, ఆయన ఏనాడూ నియోజకవర్గాన్ని వీడలేదు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యే ఉండటం ఆయనకు ప్రజల్లో సానుభూతిని తీసుకొచ్చింది. పైగా, ఆయన సతీమణి కవితను రెండుసార్లు వరుసగా కార్పొరేటర్‌గా గెలిపించుకున్న బలమైన కేడర్ మన్నె వెంటే ఉంది.

స్థానికతే ప్రధాన అస్త్రం..

ఖైరతాబాద్ ఉపఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులను కాకుండా, నియోజకవర్గంలోనే పుట్టి పెరిగిన స్థానికుడైన గోవర్ధన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ గ్రౌండ్ లెవల్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా బీఆర్ఎస్ జెండాను మోస్తూ నమ్మకమైన ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు మన్నె గోవర్ధన్ రెడ్డి. 2017 నుంచే ‘ఇంటింటికీ బీఆర్ఎస్ - సమస్యలపై సమరం’ పేరుతో స్థానిక సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందున్నారని చెబుతున్నారు. నియోజకవర్గ ఫలితాలను తారుమారు చేసే సత్తా ఉన్న కీలకమైన బీసీ, మైనారిటీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకోగల వ్యూహం ఆయన సొంతం అని చర్చ జరుగుతుంది.

దానం నాగేందర్ ఎపిసోడ్ తర్వాత ఖైరతాబాద్‌ను ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే.. స్థానిక బలం, ప్రజల్లో ఉన్న సానుభూతే అస్త్రంగా మన్నె గోవర్ధన్ రెడ్డిని బరిలోకి దించి దెబ్బకు దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అధికారిక ప్రకటన వెలువడితే ఈ సమరం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

#Khairatabad Bypoll#Khairatabad By-Election#BRS#Manne Govardhan Reddy#KCR#KTR#Danam Nagender#Telangana Politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి