తెలంగాణ

BRS: పోగొట్టుకున్న చోటే బీఆర్ఎస్ వేట.. గులాబీ బాస్ బిగ్ స్కెచ్!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

తెలంగాణలో అధికార పగ్గాలు కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు అసలుసిసలైన ఆత్మపరిశీలనలో పడింది. తాము అధికారం ఎక్కడ కోల్పోయామో గుర్తించిన గులాబీ దళం.. సరిగ్గా అక్కడే మళ్లీ పుంజుకోవడానికి పక్కా కార్యాచరణతో రణరంగంలోకి దిగుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్‌కు తిరుగులేని కంచుకోటగా నిలిచిన సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది.

BRS : తెలంగాణలో అధికార పగ్గాలు కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు అసలుసిసలైన ఆత్మపరిశీలనలో పడింది. తాము అధికారం ఎక్కడ కోల్పోయామో గుర్తించిన గులాబీ దళం.. సరిగ్గా అక్కడే మళ్లీ పుంజుకోవడానికి పక్కా కార్యాచరణతో రణరంగంలోకి దిగుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్‌కు తిరుగులేని కంచుకోటగా నిలిచిన సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. సుమారు 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్న ఈ బొగ్గు గని ప్రాంతంలో.. కార్ పార్టీ కేవలం ఆసిఫాబాద్ ఒక్క స్థానానికే పరిమితమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ చేదు నిజాన్ని గుర్తించిన బీఆర్ఎస్ అధిష్టానం, పోగొట్టుకున్న చోటే మళ్లీ పూర్వ వైభవాన్ని వెతుక్కునేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

కోల్ బెల్ట్‌పై గులాబీ గురి

రాష్ట్రంలో భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సింగరేణి బెల్ట్‌లోని సీట్ల సంఖ్య ఏకంగా 40కి పెరిగే అవకాశముంది. అంటే రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్లలో దాదాపు మూడో వంతు ఈ ప్రాంతంలోనే ఉండబోతున్నాయి. ఇక్కడ పట్టు సాధించకుండా మళ్లీ అధికారం దక్కించుకోవడం అసాధ్యమని గులాబీ నాయకత్వానికి స్పష్టత వచ్చేసింది. ఉద్యోగ, కార్మిక వర్గాలు ఎక్కువగా ఉండి, అపారమైన రాజకీయ చైతన్యం కలిగిన సింగరేణి ప్రాంతంలో ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవల్‌లో పట్టు సాధించకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తోంది.

కార్మిక ఎజెండాతో కాంగ్రెస్‌పై పోరుబాట

సింగరేణిలో మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కార్మికుల సమస్యలను ప్రధాన ఎజెండాగా మార్చుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. లాభాల్లో వాటా, పెండింగ్ బకాయిలు, మెడికల్ బోర్డుల నిర్వహణ, డిపెండెంట్ ఉద్యోగాలు, కార్మిక సంఘాల ఎన్నికలు వంటి కీలక అంశాలపై ఉద్యమ బాట పట్టాలని ప్లాన్ చేస్తోంది. తమ హయాంలో కార్మికులకు ఎంతో మేలు చేశామని గుర్తు చేస్తూనే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలను గాలికొదిలేసిందన్న అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.

‘సింగరేణి కార్మిక గర్జన’

క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, స్థానిక నాయకత్వాన్ని క్రియాశీలకం చేసేందుకు ఈ నెల 14న రామగుండంలో భారీ స్థాయిలో ‘సింగరేణి కార్మిక గర్జన’ సభను నిర్వహించబోతోంది. ఈ సభను వేదికగా చేసుకుని కోల్ బెల్ట్ వ్యాప్తంగా పార్టీ కేడర్‌ను ఎన్నికల సమరానికి సిద్ధం చేయాలని భావిస్తోంది. సభ ముగిసిన తర్వాత కూడా దూకుడు తగ్గించకుండా, నియోజకవర్గాల వారీగా నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేసింది. కోల్ బెల్ట్‌లో పూర్వ వైభవం సాధించి, తిరిగి అధికార పీఠం వైపు అడుగులు వేయాలన్న గులాబీ పార్టీ వ్యూహం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

#BRS#Telangana Politics#Singareni Coal Belt#Singareni Workers#BRS Master Plan#Singareni Workers Garjana#Ramagundam#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి