Fake Discounts: పండుగ సీజన్ రాగానే ఈ-కామర్స్ సైట్లు రంగురంగుల బ్యానర్లు, కళ్లు చెదిరే ప్రకటనలతో హోరెత్తిస్తాయి. 70 శాతం డిస్కౌంట్, 80 శాతం తగ్గింపు, డీల్ ఆఫ్ ది డే అంటూ మొబైల్ స్క్రీన్లు నిండిపోతాయి. కానీ నిజంగానే కంపెనీలు అంత భారీగా నష్టపోయి వినియోగదారులకు మేలు చేస్తున్నాయా? లేక మన మానసిక బలహీనతలతో ఆడుకుని జేబులు ఖాళీ చేయిస్తున్నాయా? ఈ పండుగ ఆఫర్ల వెనుక సాగుతున్న 'మైండ్ గేమ్'ను లోతుగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.
ధరల పెంపు.. ఆపై డిస్కౌంట్ మాయ!
అత్యంత చాకచక్యంగా కంపెనీలు అమలు చేసే మొదటి ఎత్తుగడ ‘ఆర్టిఫిషియల్ ప్రైసింగ్’. సేల్ మొదలవడానికి కొన్ని రోజుల ముందు వస్తువు అసలు ధరను కృత్రిమంగా పెంచేస్తాయి. ఉదాహరణకు సాధారణ రోజుల్లో రూ. 2,000 ఉండే ఒక వస్తువు ధరను పండుగ సేల్‌లో రూ. 4,000 అని పేర్కొని, దానిపై ‘50% భారీ డిస్కౌంట్’ ఇచ్చి మళ్లీ అదే రూ. 2,000కు అమ్ముతారు. కొనుగోలుదారుడు మాత్రం "అబ్బా.. రూ. 2,000 ఆదా చేసుకున్నాను" అనే భ్రమలో మునిగిపోతాడు. ఈ సైకలాజికల్ యాంకరింగ్ ద్వారా కస్టమర్లలో భారీగా ఆదా అయిందనే ఫీలింగ్ కల్పించి కొనిపిస్తున్నారు.
అర్జెన్సీ క్రియేషన్.. ఆలోచించే ఛాన్సే ఇవ్వరు
మొబైల్ స్క్రీన్ పై టిక్ టిక్ మంటూ తిరిగే ‘కౌంట్‌డౌన్ టైమర్’, ‘స్టాక్‌లో కేవలం ఒకటే మిగిలింది’ అన్న ఎర్రటి అలర్టులు యాదృచ్ఛికంగా వచ్చేవి కావు. అవి పక్కాగా డిజైన్ చేసిన సైకలాజికల్ ట్రాప్స్. "ఇప్పుడే కొనకపోతే ఈ ఆఫర్ చేజారిపోతుంది" అనే భయాన్ని కస్టమర్ల మెదడులోకి ఎక్కిస్తారు. నిజానికి ఆ వస్తువు అవసరం లేకపోయినా, ధరను వేరే చోట పోల్చి చూసుకునే సమయం ఇవ్వకుండా వెంటనే ‘ఆర్డర్ నౌ’ బటన్ నొక్కేలా వలలో వేస్తారు.
ఎక్స్‌చేంజ్, ఈఎంఐల పేరుతో మభ్యపెట్టడం
‘నో కాస్ట్ ఈఎంఐ’ అని ఆకర్షిస్తారు కానీ బ్యాంకు విధించే ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీల భారం యూజర్‌పైనే పడుతుంది. పాత మొబైల్‌కు రూ. 15,000 ఎక్స్‌చేంజ్ వేల్యూ ఇస్తామని ఆన్‌లైన్‌లో చూపించి, తీరా డెలివరీ ఏజెంట్ వచ్చేసరికి చిన్న గీతను సాకుగా చూపి ఆ విలువను రూ. 5,000కు తగ్గించేస్తారు. అప్పటికే కొనాలనే మూడ్‌లో ఉన్న కస్టమర్ చేసేది లేక ఆ తక్కువ ధరకే ఒప్పేసుకుంటాడు. పండుగ పూట వచ్చే ఆఫర్లు అన్నీ నిజమైన లాభాలు కావు. వాటిలో సింహభాగం కంపెనీల మార్కెటింగ్ మైండ్ గేమ్‌లే. అందుకే ఆఫర్ బోర్డులను గుడ్డిగా నమ్మకుండా.. గత కొద్ది నెలల ధరల హిస్టరీని ట్రాక్ చేసి, నిజంగా ఆ వస్తువు మనకు అవసరమా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడే పండుగ షాపింగ్ నిజమైన లాభాన్ని ఇస్తుంది.


