తెలంగాణ

Telangana Congress : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వేట.. ఆ 3 సీట్లు ఎవరికి?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్దల సభ సీట్ల కోసం అంతర్గతంగా తీవ్ర ఉత్కంఠ మొదలైంది. శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండటంతో అధికార పార్టీ నేతలంతా ఈ మూడు ఖాళీలపై కన్నేశారు. ఎన్నికల ఖర్చు, ఓటింగ్ టెన్షన్లు లేకుండా సునాయాసంగా పెద్దల సభలోకి అడుగుపెట్టే అవకాశం ఉండటంతో ఆశావహులంతా గాంధీభవన్, అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్దల సభ సీట్ల కోసం అంతర్గతంగా తీవ్ర ఉత్కంఠ మొదలైంది. శాసనమండలిలో గవర్నర్ కోటా కింద ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండటంతో అధికార పార్టీ నేతలంతా ఈ మూడు ఖాళీలపై కన్నేశారు. ఎన్నికల ఖర్చు, ఓటింగ్ టెన్షన్లు లేకుండా సునాయాసంగా పెద్దల సభలోకి అడుగుపెట్టే అవకాశం ఉండటంతో ఆశావహులంతా గాంధీభవన్, అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, ఈసారి కేవలం పైరవీలకే కాకుండా పక్కా సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గట్టి పట్టుదలతో ఉండటం పార్టీలో సంచలనం రేపుతోంది.

గవర్నర్ కోటాలో ‘బీసీ’ పవర్

ఇటీవల జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలనూ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించాల్సి వచ్చింది. దీంతో గవర్నర్ కోటాలో ఆ అసంతృప్తి రాకుండా సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన. గతంలో సిరిసిల్ల సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీ ప్రకారం.. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఒక సీటు దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో మూడు సీట్లలో ఏకంగా రెండింటిని బీసీలకే కేటాయించాలన్న డిమాండ్ పార్టీలో మరింత బలంగా తెరపైకి వచ్చింది.

ముదిరాజ్ వర్గానికి గ్రీన్ సిగ్నల్?..

రెండు సీట్లు బీసీలకే దక్కాలన్న వాదనతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి కీలక ప్రతిపాదన పంపినట్లు సమాచారం. పద్మశాలీలకు ఒకటి ఇస్తూనే, రాజకీయంగా అత్యంత కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి రెండో సీటు ఇవ్వాలన్న వ్యూహం పార్టీలో ఊపందుకుంది. ఈ సమీకరణం కనుక అమలైతే తెలంగాణ రాజకీయాల్లో బీసీ ఓటుబ్యాంకును కాంగ్రెస్ వైపు పూర్తిస్థాయిలో తిప్పుకోవచ్చని నాయకత్వం భావిస్తోంది.

మూడో సీటు ఎవరికి?..

ఉన్న మూడు సీట్లలో రెండు బీసీలకే వెళ్తే.. ఇక మిగిలిన ఒక్క సీటు ఎవరికి దక్కుతుందన్నదే అసలు సిసలైన ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ ఒక్క సీటు కోసం బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి తీవ్ర పోటీ ఉంది. ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఇన్సూరెన్స్ ఇన్‌చార్జ్ పవన్ మల్లాది, దయాసాగర్ వంటి నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గాంధీ భవన్ ఇన్‌చార్జ్ కుమార్ రావు కూడా ఈ రేసులో తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. అటు ఎస్సీ వర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు సైతం తమకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నారట.

ఎవరికి వారు పైరవీలతో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఒకవైపు వర్గాల ఆశలు, మరోవైపు పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల మధ్య కాంగ్రెస్ నాయకత్వం ఎవరికి పట్టం కడుతుందనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#Telangana Congress#Telangana MLC Nominations#Governor Quota MLCs#Revanth Reddy#Mahesh Kumar Goud#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి