Starlink : టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసించవచ్చని నిరూపించిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు భారతదేశంలో తన శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్‌లింక్’ పాగా వేసేందుకు తీవ్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని టార్గెట్ చేస్తూ, ఆయన దేశానికి ప్రధానిలా వ్యవహరిస్తూ తనను అడ్డుకుంటున్నారంటూ మస్క్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అయితే, పైకి ఇది ఇద్దరు బిలియనీర్ల మధ్య వ్యాపార పోరులా కనిపిస్తున్నప్పటికీ.. తెరవెనుక దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చే పరిణామాలు దాగి ఉన్నాయన్నది నిఘా వర్గాల విశ్లేషణ. అంతరిక్షంలో ఇప్పటికే 10 వేలకు పైగా ఉపగ్రహాలతో మూడింట రెండు వంతుల కక్ష్యను గుప్పిట్లో పెట్టుకున్న ఒక ప్రైవేట్ వ్యక్తి చేతికి భారత సమాచార వ్యవస్థను అప్పగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
ఉక్రెయిన్ అనుభవం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మస్క్ వ్యవహరించిన తీరే భారత భద్రతా సంస్థలను అత్యంత అప్రమత్తం చేస్తోంది. యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ సైన్యానికి స్టార్‌లింక్ ప్రాణాధారంగా మారిన మాట నిజమే అయినా, కీలక సమయంలో జియో-ఫెన్సింగ్ ద్వారా సిగ్నల్స్‌ను కట్ చేసి మస్క్ తన స్వార్థాన్ని ప్రదర్శించారు. క్రిమియా తీరంలో ఇంటర్నెట్ ఆన్ చేయాలన్న ఉక్రెయిన్ అభ్యర్థనలను మస్క్ నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే కాకుండా.. "నా స్టార్‌లింక్ లేకపోతే ఉక్రెయిన్ ఫ్రంట్‌లైన్ ఒక్క రోజులో కుప్పకూలిపోతుంది" అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. అంటే, రేపు భారత్‌కు ఏదైనా సంక్షోభం ఎదురైతే.. మన దేశ రక్షణ వ్యవస్థల 'స్విచ్ ఆన్.. స్విచ్ ఆఫ్' బటన్ ఒక అమెరికన్ బిలియనీర్ చేతిలో బందీ కావాల్సిందేనా అన్న తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
స్మగ్లర్లు, ఉగ్రవాదుల చేతుల్లో పరికరాలు..
భారత భూభాగంలో ఇప్పటికే స్టార్‌లింక్ పరికరాలు అవాంఛనీయ శక్తుల వద్ద బయటపడటం కలకలం రేపింది. అండమాన్ నికోబార్ దీవులలో మయన్మార్ బోటు నుంచి రూ. వేల కోట్ల విలువైన 6,000 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు స్మగ్లర్లు నావిగేషన్ కోసం స్టార్‌లింక్‌నే వాడినట్లు తేలింది. మణిపూర్ ఆపరేషన్లలోనూ ఇవే పరికరాలు దొరికాయి. అయితే ఆ పరికరాలను కొన్న అసలు వ్యక్తుల వివరాలు ఇవ్వాలని భారత భద్రతా సంస్థలు కోరితే.. 'డేటా ప్రైవసీ' పేరిట సమాచారం ఇచ్చేందుకు స్టార్‌లింక్ నిరాకరించింది. దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసిరే ఇలాంటి వైఖరి భారత్‌ను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.
భారత్ లొంగే ప్రసక్తే లేదు
స్పేస్‌ఎక్స్ సంస్థ అమెరికా అంతరిక్ష దళం, పెంటగాన్ నిఘా విభాగాలకు కీలక సేవలు అందిస్తోంది. రేపు వాషింగ్టన్ ఒత్తిడికి తలొగ్గి భారత సున్నితమైన సమాచారాన్ని అమెరికాకు చేరవేయరన్న గ్యారెంటీ ఏంటి? అందుకే స్పెక్ట్రం కేటాయింపులు, డేటా లోకలైజేషన్, స్థానిక సర్వర్లలో స్టోరేజ్ వంటి కఠినమైన భద్రతా రూల్స్‌ని పాటించాల్సిందేనని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తేల్చిచెప్పారు. దేశ భద్రత, పౌరుల గోప్యత కంటే ఏ బడా కార్పొరేట్ వ్యాపార సామ్రాజ్యమూ ముఖ్యం కాదని భారత్ స్పష్టం చేస్తోంది. డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలంటే మస్క్ బెదిరింపులకు తలొగ్గకుండా కఠినంగా ఉండటమే దేశానికి శ్రీరామరక్ష.


