కలియుగ వైకుంఠమైన తిరుమల వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనం కోసం విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. సోమవారం సాయంత్రం సమయానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సర్వదర్శనం (SSD) పొందే భక్తులకు స్వామివారి మూలవిరాట్టు దర్శనం కావడానికి దాదాపు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
భక్తుల రాక పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, అలాగే నారాయణగిరి వద్ద ఉన్న 9 షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. అంతేకాకుండా క్యూలైన్ వైకుంఠం కాంప్లెక్స్ దాటి వెలుపలికి వచ్చి, శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. మరోవైపు ముందుగానే సమయం కేటాయించిన టైమ్‌స్లాట్ దర్శన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇక శ్రీవారి క్షేత్రంలో భక్తుల సేవలు, హుండీ ఆదాయ లెక్కలను పరిశీలిస్తే.. ఆదివారం ఒక్కరోజే మొత్తం 97,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి తమ మొక్కుబడులు చెల్లిస్తూ 37,108 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శనివారం రోజున భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారికి రూ.3.93 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు ప్రకటించారు.


