నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నిన్న అర్ధరాత్రి కూల్చివేశారు. భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత కొనసాగినట్టు తెలుస్తోంది. నర్సంపేట పట్టణంలోని మెడికల్ కాలేజీ సమీపంలో బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాన్ని అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని మున్సిపల్ అధికారులు ఆరోపిస్తున్నారు.
అయితే,పెద్ది విగ్రహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికే సిటీలో చాలా వరకు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఉన్నాయని, మరి వాటిమీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, నిన్నరాత్రి సుమారు 1500 మంది పోలీసుల భద్రత నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్టు సమాచారం.
అంతముందే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఇళ్లకు వెళ్లి నిద్రలో నుంచి లేపి మరి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విగ్రహం కూల్చివేసిన అనంతరం నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్ద 400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇదిలాఉండగా, గతంలో విగ్రహం ఏర్పాటు సమయంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, శీలం వీరన్న, రాయిడి దుష్యంత్ రెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలాఉండగా, పెద్ది సుదర్శన్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, ఆయన్ను మానసికంగా ఒత్తిడి చేయడం వల్లే మరణించాడని ఆయన అభిమానులు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.పెద్ది విగ్రహం పట్ల కాంగ్రెస్ ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నదని మండిపడుతున్నారు.కాగా, విగ్రహం కూల్చివేసిన ఘటనలో నర్సంపేటలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


