రాజకీయాలు

మంత్రి వ్యాఖ్యల కలకలం.. అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన సీఎం విజయ్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తమిళనాడు శాసనసభ సమావేశాల్లో తీవ్ర దుమారం రేపిన ఓ వివాదానికి ముఖ్యమంత్రి సమయస్ఫూర్తితో తెరపడింది. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా డీఎంకే దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని గౌరవసూచకమైన బిరుదులు లేకుండా నేరుగా పేరుతో ప్రస్తావించిన అటవీశాఖ మంత్రి ఆర్.వి. రంజిత్ కుమార్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

తమిళనాడు శాసనసభ సమావేశాల్లో తీవ్ర దుమారం రేపిన ఓ వివాదానికి ముఖ్యమంత్రి సమయస్ఫూర్తితో తెరపడింది. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా డీఎంకే దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని గౌరవసూచకమైన బిరుదులు లేకుండా నేరుగా పేరుతో ప్రస్తావించిన అటవీశాఖ మంత్రి ఆర్.వి. రంజిత్ కుమార్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అయితే పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వెంటనే జోక్యం చేసుకుని, సదరు మంత్రి తరఫున సభకు క్షమాపణలు చెప్పడంతో సభలో శాంతియుత వాతావరణం నెలకొంది.

శాసనసభలో ఆరోగ్య, రెవెన్యూ శాఖల పద్దులపై విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతున్న సమయంలో మంత్రి రంజిత్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత ఎన్నికల్లో వెలుగుచూసిన 'తిరుమంగళం ఫార్ములా' ఓటుకు నోట్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, గతంలో కాంచీపురం నియోజకవర్గంలో ఓటుకు రూ.1,500 వరకు పంపినీ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో డీఎంకే అగ్రనేత కరుణానిధి ప్రస్తావన తెస్తూ ఆయనను 'కళైనార్' అని గానీ లేదా 'మాజీ ముఖ్యమంత్రి' అని గానీ అనకుండా కేవలం 'కరుణానిధి' అని సంబోధించడంతో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.

దివంగత ప్రజానేతను ఏకవచనంతో, గౌరవం లేకుండా ప్రస్తావించడం సభా సంప్రదాయాలను కాలరావడమేనంటూ డీఎంకే సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ ఆధ్వర్యంలో డీఎంకే ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి విజయ్ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుని, దివంగత నాయకులను ఆ విధంగా సంబోధించడం పొరపాటేనని అంగీకరించారు. "మంత్రి చేసిన తప్పుకు ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను" అని సభలో ప్రకటించి వివాదాన్ని సర్దుమణిగేలా చేశారు.

తమిళనాడు రాజకీయంలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన కరుణానిధిని 'కళైనార్' అని గౌరవంగా పిలవడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. అటువంటి సంప్రదాయానికి భంగం వాటిల్లడంతో నిరసనలు వ్యక్తమైనప్పటికీ, ముఖ్యమంత్రి విజయ్ తక్షణమే స్పందించి సారీ చెప్పడం ద్వారా శాసనసభ గౌరవాన్ని, నిబంధనలను కాపాడారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

#Tamil Nadu Assembly News#CM Vijay Apology#Karunanidhi Kalaignar Controversy#Tamil Nadu Politics 2026#RV Ranjith Kumar Minister#DMK Opposition Protests Assembly#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి