పోలీసింగ్‌లోకి AI ఎంట్రీ
కష్టాల్లో ఉన్నామని కాల్ చేస్తే.. క్షణాల్లో రెస్పాన్స్
పోలీసు శాఖ నెక్స్ట్ జనరేషన్ సేవలు
తెలంగాణ పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియోగం కీలక దశకు చేరుకుంది. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు రాష్ట్ర పోలీసులు AI ఆధారిత నెక్స్ట్ జనరేషన్ తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (TG-ERSS) – Dial 112ను ప్రారంభించారు.
కొద్ది రోజుల కిందటే హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. పోలీస్, ఫైర్, అంబులెన్స్, మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, విపత్తుల నిర్వహణ వంటి అనేక అత్యవసర సేవలను ఒకే 112 వ్యవస్థ కింద సమన్వయం చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
అయితే ఇది కేవలం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావడం మాత్రమే కాదని పోలీసు అధికారులు చెబుతున్నారు. అత్యవసర కాల్ వచ్చిన క్షణం నుంచి ఫీల్డ్‌లో సహాయం అందే వరకు మొత్తం ప్రక్రియను మరింత వేగంగా, సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు.
Dial 112లో AI ఏం చేస్తుంది?
ఇప్పటివరకు అత్యవసర కాల్ వచ్చినప్పుడు ఆపరేటర్ సమాచారం తీసుకుని సంబంధిత అధికారులకు చేరవేసేవారు. కొత్త వ్యవస్థలో ఈ ప్రక్రియలోని అనేక దశలకు AI, ఆటోమేషన్‌ను జోడించారు.
కాల్ వచ్చిన వెంటనే AI దానిని విశ్లేషించి, అవసరమైతే వాయిస్ టు టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్ ద్వారా మాట్లాడిన సమాచారాన్ని టెక్స్ట్‌గా మార్చుతుంది. ఘటన తీవ్రతను బట్టి కాల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, డూప్లికేట్ లేదా నాన్ ఎమర్జెన్సీ కాల్స్‌ను ఫిల్టర్ చేయడం, సరైన సర్వీసెస్‌కి కాల్‌ను రూట్ చేయడం వంటి పనుల్లో AI సహాయపడుతుంది.
అంటే ఒకేసారి వందల సంఖ్యలో కాల్స్ వచ్చినా, ఏది నిజమైన ఎమర్జెన్సీ, ఏది ఎక్కువ ప్రమాదకరమైన ఘటన అనేది గుర్తించి స్పందనకు ప్రాధాన్యత ఇవ్వడానికి వ్యవస్థ సహాయపడుతుంది.
లొకేషన్ తెలియకపోయినా సహాయం అందుతుందా?
అత్యవసర సమయంలో చాలాసార్లు బాధితులు తాము ఉన్న ప్రదేశాన్ని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ప్రమాదం, భయం లేదా మాట్లాడలేని పరిస్థితుల్లో ఇది మరింత కష్టంగా మారుతుంది.
కొత్త Dial 112 వ్యవస్థలో అడ్వాన్స్‌డ్ కాలర్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ సదుపాయాలను ఉపయోగిస్తున్నారు. రకరకాల సాధనాల ద్వారా కాలర్ లొకేషన్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తారు. దీంతో కాల్ చేసిన వ్యక్తి సరైన అడ్రస్ చెప్పలేకపోయినా, రెస్పాన్స్ టీమ్‌కు ఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయం లభిస్తుంది.
ఇలాంటి వ్యవస్థ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు, అగ్ని ప్రమాదాలు, మెడికల్ ఎమర్జెన్సీ వంటి సందర్భాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది.
190 సెకన్ల నుంచి 133 సెకన్లకు
ఈ కొత్త వ్యవస్థలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మార్పు కాల్ సెంటర్ టైమ్ ప్రాసెసింగ్. తెలంగాణ పోలీసుల లెక్కల ప్రకారం, ఒక కాల్‌ను ప్రాసెస్ చేయడానికి తీసుకునే సగటు సమయం 100 సెకన్ల నుంచి 69 సెకన్లకు తగ్గింది. డిస్పాచర్ ప్రాసెసింగ్ టైమ్ కూడా 90 సెకన్ల నుంచి 64 సెకన్లకు తగ్గింది.
దీంతో మొత్తం కాల్ సెంటర్ ప్రాసెసింగ్ టైమ్ 190 సెకన్ల నుంచి 133 సెకన్లకు తగ్గిందని పోలీసులు తెలిపారు. అంటే దాదాపు 30 శాతం మెరుగుదల నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో కొన్ని సెకన్లు కూడా కీలకమే. ముఖ్యంగా ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు లేదా ప్రాణాపాయ పరిస్థితుల్లో సమాచారం field teamకు ఎంత త్వరగా చేరుతుందో ఫలితంపై ప్రభావం చూపుతుంది.
తెలంగాణలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎంత వేగంగా ఉంది?
తెలంగాణ పోలీసుల ప్రకారం, రాష్ట్రంలో సగటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్ ప్రస్తుతం సుమారు 10 నిమిషాల 30 సెకన్లుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సగటు రెస్పాన్స్ టైమ్ సుమారు ఆరు నిమిషాలు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 15 నిమిషాలుగా ఉంది. పోలీసులు పేర్కొన్న జాతీయ సగటు సుమారు 18 నిమిషాలతో పోలిస్తే తెలంగాణ రెస్పాన్స్ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
రోజుకు భారీగా కాల్స్.. AI ఎందుకు అవసరం?
Dial 112 కేంద్రానికి రోజూ భారీ సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. పోలీసుల లెక్కల ప్రకారం, రోజుకు సుమారు 14 లక్షల IVR calls వస్తుండగా, వాటిలో సుమారు 18,000 ఎమర్జెన్సీ కాల్స్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. దాదాపు 7,500 ఘటనలు ఫీల్డ్ యూనిట్స్‌కి డిస్పాచ్ అవుతున్నాయి.
ఇలాంటి సందర్భంలో డూప్లికేట్, బ్లాంక్, స్పామ్, యాక్సిడెంటల్ కాల్స్‌ను గుర్తించడం చాలా ముఖ్యం. AI- ద్వారా వర్క్ లోడ్ తగ్గించడంతో పాటు, నిజంగా అత్యవసర సహాయం అవసరమైన వారికి వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.
పోలీసింగ్‌లోకి డ్రోన్లు కూడా
AIతో పాటు తెలంగాణ పోలీసులు డ్రోన్లను కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ డ్రోన్లను ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్‌గా ఉపయోగించే ప్రణాళిక ఉంది. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, విపత్తులు వంటి సందర్భాల్లో ఘటన స్థలానికి ముందుగా డ్రోన్ ను పంపి విజువల్స్ సేకరించే అవకాశం ఉంది.
అంటే భవిష్యత్తులో ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు కేవలం పట్రోల్ వెహికల్ మాత్రమే కాకుండా, అవసరాన్ని బట్టి డ్రోన్ కూడా ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని కమాండ్ సెంటర్‌కు లైవ్‌గా అందించే విధానం రావచ్చు.
T-SPARKతో దర్యాప్తులో కూడా AI
AI వినియోగం కేవలం Dial 112కే పరిమితం కావడం లేదు. తెలంగాణ పోలీసులు T-SPARKలో కూడా కొత్త AI- విధానాన్ని ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించడం, దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచడం వంటి అంశాల్లో AIను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలీస్, కోర్టులు, జైళ్ల మధ్య రియల్ టైమ్ డేటా షేరింగ్‌ను మెరుగుపరచడం, దొంగిలించిన వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని వ్యవస్థలోకి అనుసంధానించడం వంటి చర్యలు కూడా చేపడుతున్నారు.


