22ఏ భూములపై కీలక ఆదేశాలు
ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని సూచన
దరఖాస్తులు తిరస్కరించొద్దని స్పష్టం
భూమి నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చిందో పరిశీలన
రికార్డులు పూర్తిగా తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788 ఏర్పాటు
స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్
నిషేధిత భూముల జాబితా అంశంలో పొరపాటు జరిగినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు ఒప్పుకున్నారు. 22ఏ భూముల జాబితా వివాదంపై గత కొన్ని రోజులుగా స్వేచ్ఛ న్యూస్ అనేక కథనాలు రాసింది. ప్రైవేట్ ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో చేర్చిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. భూ బాధితులకు అండగా నిలబడింది. వారి వాయిస్‌ను బలంగా వినిపించింది. నిషేధిత భూముల జాబితా అప్ డేట్‌లో పొరపాట్లు జరిగాయని వరుసగా కథనాలు ఇచ్చింది. స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల 22ఏ పై బీబీసీకి కూడా వివరాలు ఇచ్చారు. ఈ కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్వయంగా మంత్రి పొంగులేటి రంగంలోకి దిగారు. 22ఏ భూముల అంశంపై సోమవారం ఉదయం నుంచి సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. అనంతరం తప్పు జరిగినట్లు ప్రెస్ మీట్‌లో ఒప్పుకుని క్షమాపణ చెప్పారు.
అధికారుల తప్పిదం.. క్షమించండి
22ఏ నిషేధిత భూముల జాబితాపై మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. నిషేధిత జాబితా అప్‌డేట్ చేయడంలో పొరపాటు జరిగిందని అంగీకరించారు. పొరపాటున కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములు 22ఏ నిషేధిత భూముల జాబితాలో పడ్డాయని, ఇది అధికారుల తప్పిదంగా పేర్కొన్నారు. భూ బాధితులకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎవరి భూములను లాక్కోదని హామీ ఇచ్చారు. 22ఏ నిషేధిత లిస్టులో చేర్చిన భూముల్లో న్యాయబద్దమైన వాటిని పరిశీలించి లిస్ట్ నుంచి త్వరలోనే తొలగిస్తామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.
మొత్తం 750 దరఖాస్తులు
''ప్రైవేట్ వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. తమ ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత భూముల లిస్టులో పెట్టారని మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా మేడ్చల్ నుంచి 511, రంగారెడ్డి జిల్లాలో 148 అప్లికేషన్లు వచ్చాయి. అల్విన్ కాలనీలోనూ ప్రైవేట్ వ్యక్తుల భూములు 22ఏలో పడ్డాయి. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ఐజీ స్థాయి వరకు సమీక్ష చేస్తాం. కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములు 22ఏ నిషేధిత భూముల జాబితాలో పడ్డాయని గుర్తించాం. ముమ్మాటికీ ఇది మా అధికారుల తప్పిదమే. అధికారుల తరపున నేను క్షమాపణలు చెబుతున్నా. దీనిపై ఉన్నతాధికారులతో కమిటీ వేస్తాం. ప్రతి దరఖాస్తును కమిటీ పరిశీలించి సమస్యను పరిష్కరిస్తుంది'' అని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
అధికారులతో కీలక సమీక్ష
22ఏ నిషేధిత భూముల అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 22ఏ పేరుతో సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనంపై ‘స్వేచ్ఛ’ గత వారం రోజులుగా అనేక కథనాలు రాసింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ కథనాలు ప్రచురించింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే సమీక్షకు ఆదేశించారు. సచివాలయంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 22ఏను ఒక భూతంగా చూపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పడం, కావాలని జాప్యం చేయడం, చిన్న సమస్యను పెద్దదిగా మార్చడం ఇకపై కుదరదని తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం అధికారులుగా మీ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ల వారీగా వస్తున్న దరఖాస్తులు, వాటి పెండింగ్ కారణాలు, పరిష్కార గడువులపై ఆయన లోతుగా విచారించారు. కేవలం నిషేధిత జాబితాలో భూమి ఉందనే ఒకే ఒక్క కారణంతో దరఖాస్తులను తిరస్కరించవద్దని చెప్పారు. అసలు ఆ భూమి ఆ జాబితాలోకి ఎలా వచ్చిందో పరిశీలన చేయాలన్నారు. సంబంధిత రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను సమగ్రంగా తనిఖీ చేశాకే నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. నిజమైన భూ యజమానులకు న్యాయం చేస్తూనే, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని అన్నారు.
టోల్ ఫ్రీ ఏర్పాటు
నిషేధిత భూముల జాబితా కారణంగా ప్రైవేట్ ఆస్తుల యజమానులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూముల గురించి వారిలో అనేక అనుమానాలు, ఆందోళనలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించింది. నిషేధిత భూముల జాబితా అంశంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే భూ యజమానులు టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788 కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి పొంగులేటి సూచించారు.












