తెలంగాణ

Wanaparthy: కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాల సెగ.. చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

స్వార్థపరుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి అభివృద్ధి తప్ప ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడలేదని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

వనపర్తి కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారితీశాయి. తన 48 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరిస్తూనే ముందుకు సాగుతున్నానని చిన్నారెడ్డి అన్నారు.

గోపాల్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో కొంతకాలంగా తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. తప్పులు చేస్తున్న వారిని బయటకు పంపించే రోజు వస్తుందని, తాము పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. స్వార్థపరుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి అభివృద్ధి తప్ప ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడలేదని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చానని గుర్తుచేశారు. సొంత పార్టీ నాయకులే తాను చేపట్టాలనుకున్న అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గోపాల్‌పేట కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినా కొందరు నాయకులు రాకపోవడం బాధాకరమన్నారు. కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం పనిచేయాలని, సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని సూచించారు.

అయితే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవీకాలం ముగిసే సమయంలో మరోసారి క్యాబినెట్ హోదా పొందేందుకే బ్లాక్‌మెయిల్ ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. వనపర్తి నుంచి చిన్నారెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారని పేర్కొన్న మేఘారెడ్డి.. గతంలో టికెట్ల విషయంలో జరిగిన వ్యవహారాలపై ప్రశ్నలు సంధించారు. 2023లో పార్టీ గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయించిందని అన్నారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత చిన్నారెడ్డిపై ఉందని.. హైదరాబాద్‌లో ఉండాల్సిన వ్యక్తి వనపర్తి గల్లీల్లో తిరుగుతూ రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏమిటని మేఘారెడ్డి ప్రశ్నించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు.

చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని కూడా మేఘారెడ్డి తెలిపారు. దీంతో వనపర్తి కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఒకవైపు చిన్నారెడ్డి తనను తాను పార్టీకి అంకితం చేసుకున్న సీనియర్ నేతగా చెబుతుండగా.. మరోవైపు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి కాంగ్రెస్‌లో ఈ వివాదం ఆసక్తికరంగా మారింది.

#Telangana#Vanaparthy#congress#Megha Reddy#Chinna Reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి