Harish Rao: రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రేవంత్ ప్రభుత్వం కదలడం లేదని, వారికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని స్పష్టంగా అర్థమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎంత అలర్ట్ గా ఉందో ఆగస్టు 5న తెలంగాణ భవన్ లో తాను పెట్టిన మీడియా సమావేశం ద్వారా స్పష్టమైందన్నారు. బీఆర్ఎస్ చేసిన పోరాటం, మా దెబ్బకే నేడు GRMB, KRMB సమావేశాలు వాయిదా పడ్డాయని చెప్పారు. కేవలం సమావేశాలు వాయిదా పడితే సరిపోదు.. ఎజెండా నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టుల అంశాన్ని కచ్చితంగా తొలగించాల్సిందేనని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా చిట్ చాట్ లో హరీశ్ రావు పలు అంశాలపై స్పందించారు.
నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల 15 వేల మందికి ఈ పథకం ఒక భరోసా ఇచ్చిందని తెలిపారు. కానీ, ఆగస్టు 13 నుంచి ఈ రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన మంచి పథకాలను ఒక్కొక్కటిగా తీసేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చే బీమా పథకం వల్ల ఏకంగా 13 లక్షల మంది రైతులు బీమాకు దూరం అవుతున్నారని ఆరోపించారు.
ఫీజు రియింబర్స్ మెంట్ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 19 వేల కోట్ల బకాయిలు పెట్టిపోతే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ డబ్బును మేమే చెల్లించామన్నారు. ప్రభుత్వాలు మారినా పాత పథకాలను కొనసాగించాలన్న కనీస ఇంగితం ఈ రేవంత్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. కేసీఆర్ తెచ్చిన పాత రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజల సొమ్ముతో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
''2వేలు పెంచి రైతు బంధు ఇచ్చానని ఆయన పదేపదే చెబుతున్న మాటలు పూర్తిగా అబద్ధం. లెక్కలు తీస్తే.. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ 14,743 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024-2025 సంవత్సరంలో ఇచ్చింది కేవలం 5,057 కోట్లు మాత్రమే. అంటే సుమారు 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. అలాగే 2025 సంవత్సరానికి 11,800 కోట్లు ఇచ్చి, దాదాపు 19 వేల కోట్ల రూపాయల రైతు బంధును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇవ్వాల్సినవి ఎగ్గొట్టి, పెంచి ఇచ్చానని అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రికి తగునా? అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.


