తెలంగాణ

Harish Rao: రేవంత్ ప్రభుత్వం పక్కా కుట్ర.. కల్యాణ లక్ష్మి పథకంపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

రచన: NK•••7 నిమిషాల పఠనం

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కుట్రతో, ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి ఖతం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆపేశాం అని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. కానీ.. కోర్టు స్టే రాకముందే ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు పాతాళంలో బొంద పెట్టిందని ధ్వజమెత్తారు.

Harish Rao: కల్యాణ లక్ష్మి స్కీమ్ అమలుపై స్టే విధిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దీనిపై వివాదం జరుగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అధికార పక్షాన్ని టార్గెట్ చేశారు. కల్యాణలక్ష్మి పథకం పూర్తిగా రద్దు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ భవన్‌లో మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కుట్రతో, ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి ఖతం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆపేశాం అని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. కానీ.. కోర్టు స్టే రాకముందే ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు పాతాళంలో బొంద పెట్టిందని ధ్వజమెత్తారు.

లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పడిపోయింది?

మంత్రి పొన్నం ప్రభాకర్ ఏవో 16 లక్షల లెక్కలు చెబుతున్నారు.. కానీ అందులో వాస్తవాలు వేరు అని చెప్పారు. కేసీఆర్ హయాంలో తాము ఏకంగా 14 లక్షల 50 వేల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి ఇచ్చి ఆదుకున్నామని హరీశ్ రావు తెలిపారు. జనాభా పెరిగినప్పుడు సహజంగానే పెళ్లిళ్ల సంఖ్య, దరఖాస్తులు పెరగాలి కదా అని అడిగారు. కానీ కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పడిపోయిందో ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం చెప్పాలన్నారు.

ఆడబిడ్డల మీద కక్షతో చేసిన కుట్ర

''ఒకప్పుడు కేసీఆర్ పాలనలో (2021-22) 2,31,371 పెళ్లిళ్లకు ఒక్క ఏడాదే ఆర్థిక సాయం అందించాం. కానీ కాంగ్రెస్ వచ్చాక 2024-25లో కేవలం 1 లక్షా 58 వేల పెళ్లిళ్లకు మాత్రమే సాయం చేశారు. ఇక 2025-26 సంవత్సరంలో మరీ దారుణంగా కేవలం 86 వేల పెళ్లిళ్లకు మాత్రమే అంటే కేవలం 870 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారు. పథకాన్ని ఎలా నీరుగార్చారో చెప్పడానికి ఈ లెక్కలే సాక్ష్యం. కోర్టులో ఈ ప్రభుత్వం ఎంత ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలంగాణ సమాజం మొత్తం చూస్తోంది. కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు 30 రోజుల సమయం ఇచ్చినా కావాలనే కౌంటర్ వేయకుండా వదిలేశారు. మీరు కౌంటర్ వేయకపోవడం వల్లే కదా కోర్టు స్టే ఇచ్చింది? ఇది ఆడబిడ్డల మీద కక్షతో మీరు చేసిన కుట్ర కాదా?

డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు ఎందుకెళ్లలేదు?

దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. దీన్నిబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పట్ల ఉన్న ప్రేమ ఏ పాటిదో ఇట్టే అర్థమవుతోంది. కల్యాణ లక్ష్మి ఆగిపోతే పట్టించుకోని ఈ ప్రభుత్వం.. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించి, రోడ్లెక్కి పోరాటం చేశాకే ఉలిక్కిపడి కదిలింది.

సింగిల్ జడ్జి స్టే ఇచ్చిన వెంటనే డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు ఎందుకు పోలేదు? బీఆర్ఎస్ పోరాటం దెబ్బకు భయపడి.. ఇప్పుడు హడావిడిగా అఫిడవిట్ వేస్తాం, అప్పీల్ కు పోతాం అని కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు. బీఆర్ఎస్ ఒత్తిడి లేకపోతే ఈ పథకాన్ని ఎప్పుడో శాశ్వతంగా సమాధి చేసేవాళ్లు.

లాయర్ ఫీజు రోజుకు 50లక్షలు

నా మీద రాజకీయ కక్ష సాధింపు కోసం, తప్పుడు కేసులు పెట్టి వాదించడానికి సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాను ప్రత్యేకంగా తెచ్చుకున్నారు. ఆయనకు రోజుకు 50 లక్షల రూపాయల ఫీజు చెల్లించడానికి ముఖ్యమంత్రి రేవంత్ కి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులకు రోజుకు 50 లక్షలు కట్టే ప్రభుత్వానికి.. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కల్యాణ లక్ష్మి కేసును వాదించడానికి ఒక మంచి లాయర్‌ దొరకలేదా? లేక కావాలనే లాయర్ ను పెట్టలేదా?

సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వం బాధ్యత

కేసీఆర్ కి పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికున్న తేడా ఏంటో ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాడు కేసీఆర్ మొదటి కేబినెట్ సమావేశంలోనే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేశారు. కానీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎలా ఎత్తివేయాలా అని కుట్రలు చేస్తున్నారు. సంక్షేమం అనేది పాలకులకు ఇష్టం ఉంటే పేదలకు చేసే దానం కాదు. అది ఒక ప్రభుత్వం బాధ్యత. రాజ్యాంగం మీకు అప్పగించిన ప్రాథమిక బాధ్యత. సంక్షేమ పథకాలను ఉద్దేశపూర్వకంగా ఆపడం అంటే.. పేదల కడుపు కొట్టడమే కాదు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమే'' అని హరీశ్ రావు అన్నారు.

#Harish Rao#Brs#Kalyana Lakshmi#Scheme#Cm Revanth Reddy#Telangana Govt#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి