Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో మీడియా చిట్ చాట్ లో రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 22A సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి, అయోమయానికి గురిచేస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎవరి భూమి 22A లో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 1999లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం రద్దు
దేశవ్యాప్తంగా 1999లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారని, మన రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారని హరీశ్ గుర్తు చేశారు. కానీ ఆనాడు సీలింగ్ పరిధి నుంచి బయటపడి, క్లియర్ అయిన భూములను కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చి సీలింగ్ యాక్ట్ కింద 22A లో పెట్టడం ఏ రకమైన న్యాయం అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన, పాలనపై పట్టు లేదనడానికి ఇదే నిదర్శనం అని విమర్శించారు. ఏకంగా ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
రిజిస్ట్రేషన్ కోసం కట్టిన చలాన్ డబ్బులూ వాపస్ ఇవ్వడం లేదు
''హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్‌లో చేర్చారు. శ్రీనగర్ కాలనీ సర్వే నంబర్ 8, 9లలో గత 20 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల ప్రాపర్టీలను కూడా ఇప్పుడు 22A లో పెట్టడం దుర్మార్గం. 30ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? తమ ప్రాపర్టీ 22A లో ఉందన్న విషయం చాలామంది సామాన్యులకు తెలియడం లేదు. తీరా రిజిస్ట్రేషన్ కోసం చలాన్లు కట్టి, డబ్బులు చెల్లించిన తర్వాత.. చివర్లో మీ భూమి 22A లో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపేస్తున్నారు. పైగా రిజిస్ట్రేషన్ కోసం కట్టిన చలాన్ డబ్బులు కూడా వాపస్ ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజల సొమ్మును నిలువునా దోచుకుంటోంది.
బ్యాంకులు లోన్లు ఇచ్చిన భూములు కూడా 22ఏలో..
గతంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా NOC వచ్చిన భూములకు బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాయి. ఇప్పుడు అవే భూములను తీసుకొచ్చి 22A లో పెట్టడంతో అటు ప్రజలు, ఇటు బ్యాంకులు ఇద్దరూ ఆగం అవుతున్నారు. బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీ లాంటి ప్రాంతాలను సైతం ప్రొహిబిషన్ లో పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 22A అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఒక ఆయుధంగా మారింది.
22ఏ నుంచి భూమిని తీయాలంటే 30శాతం కమీషన్ డిమాండ్
రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా, 22A నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. 30 శాతం కమీషన్ లేనిదే రెవెన్యూ శాఖలో ఒక్క ఫైల్ కూడా కదలడం లేదు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22A ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది. తన సొంత ఇంటికి సెగ తగిలే సరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైంది. నీకు చురుకు తగిలితేనే కానీ సామాన్యుల బాధలు పట్టవా? స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ల గోడు ఎవరు వినాలి? హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది ఈ ప్రభుత్వ తీరు.
తక్షణమే ఆ భూములను 22A నుంచి తొలగించాలి
ముందు అడ్డగోలుగా భూములను 22A లో వేయడం, ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తాం అని డ్రామాలు ఆడటం ఎందుకు? తప్పు జరిగినప్పుడు తక్షణమే ఆ భూములను 22A నుంచి తొలగించాలి కానీ.. ఈ రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? కమీషన్ల కోసమేనా? అసలు ఈ ప్రాపర్టీలను 22A లో ఎవరు పెట్టారు? కమీషన్లు తీసుకుని ఎవరు తొలగిస్తున్నారు? దీనిపై తక్షణమే విచారణ జరగాలి. డిసెంబర్ 7, 2023 నుంచి భూములను ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టిన వివరాలపై ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలి. అప్పటిలోగా ఈ ఆస్తులన్నింటినీ 22A పరిధి నుంచి మినహాయించాలి'' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


