తెలంగాణ

Telangana: ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిన తెలంగాణ.. రేవంత్ సర్కార్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..

రచన: Venu••12 నిమిషాల పఠనం

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేశారని, ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా చెప్పకపోయినా ఆడబిడ్డలకు అండగా ఉండాలనే బాధ్యతతో అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసినట్టు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే తెలంగాణ పార్టీ నేతలు పరస్పర విమర్శలతో పొలిటికల్ హిట్ పుట్టిస్తున్నారు.. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 35 నుంచి 51 వరకు సంక్షేమం అనేది రాజ్యం యొక్క ప్రాథమిక బాధ్యత అని స్పష్టంగా చెబుతున్నట్టు పేర్కొన్నారు..

నాడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేశారని, ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా చెప్పకపోయినా ఆడబిడ్డలకు అండగా ఉండాలనే బాధ్యతతో అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసినట్టు తెలిపారు. మరోవైపు పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ 100 రోజుల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు 8 గ్రాముల బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, చెప్పినట్టుగానే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కానీ తెలంగాణలో మాత్రం కల్యాణ లక్ష్మి దరఖాస్తులు లక్షకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, పెళ్లిళ్లు జరిగి పిల్లలు పుడుతున్నా డబ్బులు రావడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కల్యాణ లక్ష్మి కాస్తా సంతాన లక్ష్మిగా మారిపోయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అలాగే కొత్త రేషన్ కార్డులను బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుందని అప్పట్లో కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేశారని గుర్తు చేశారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా లక్షా 40 వేల రేషన్ కార్డులను తొలగించి పేదల కడుపు కొట్టిందని ఆరోపించారు. రేషన్‌లో సీలింగ్ ఎత్తివేసి ప్రతి ఒక్కరికీ 6 కేజీల బియ్యం ఇచ్చింది, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యం అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఉద్యోగుల జీవితాలతో కూడా ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించిన హరీష్ రావు.. గత మూడు నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి EHS డబ్బులు కట్ చేస్తున్నా, ఆ కార్డుతో ఏ ఆసుపత్రిలో చికిత్స పొందాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు.

సిద్దిపేటకు చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ ఖాజా మొహియుద్దీన్ భార్య అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, ఏకంగా 11 లక్షల రూపాయల బిల్లు వేశారని చెప్పారు. EHS వర్తించకపోవడంతో ఆ బిల్లును ఎలాగైనా తగ్గించాలని ఆయన తనను కలిసి వేడుకున్న పరిస్థితి చూసి గుండె తరుక్కుపోయిందన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేకుండానే జర్నలిస్టులను కూడా EHSలో చేర్చిందని గుర్తు చేశారు.

మరోవైపు ప్రభుత్వం EHS విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో రివ్యూ చేస్తే 2023 నవంబర్ నుంచి ఏకంగా 24 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ నిధులు రాలేదని స్వయంగా సూపరింటెండెంట్ చెప్పినట్టు పేర్కొన్నారు. ఇక పోలీసుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. వారికి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ నిలిచిపోయిందని, భద్రత లేదని, EHS కూడా వర్తించడం లేదని, ఈ పరిస్థితిపై పోలీస్ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు..

ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన.. ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిపోయిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సొంత మనుషులకు మాత్రమే న్యాయం జరుగుతోందని, దళితులు, గిరిజనులు, బీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. దళితులు, ఎస్టీలు, బీసీల కోసం ఈ ప్రభుత్వం ఒక్క సింగిల్ స్కీమ్ అయినా తీసుకొచ్చిందా అని హరీష్ రావు ప్రశ్నించారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను గొప్పగా ప్రకటించి చివరకు చెత్తబుట్టలో పడేశారని.. బడ్జెట్‌లో కేటాయింపులు చూపించడమే తప్ప నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీల కోసం 5,400 కోట్లు కేటాయిస్తే కేవలం 74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, గిరిజనుల కోసం 2,730 కోట్లు కేటాయించి ఒక్క గిరిజనుడికి కూడా రూపాయి ఇవ్వలేదని, మొత్తం మీద కేవలం 52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.

మరోవైపు దళితబంధు కింద 2 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, రాష్ట్రంలోని 33 కార్పొరేషన్లకు 14,500 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి, ఇప్పటివరకు కేవలం 305 కోట్లు మాత్రమే ఖర్చు ఆరోపించారు. అలాగే బీసీ కార్పొరేషన్‌లో కేవలం 6 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, చైర్మన్ల పదవీకాలం ముగిసిపోతున్నా ఒక్క స్కీమ్ కింద కూడా పైసా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడి సాధించారని, ఆయన తెలంగాణ తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన దార్శనిక నాయకుడని ఈ సందర్భంగా హరీష్ రావు కొనియాడారు. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న స్కాములను ఆధారాలతో సహా బయటపెడుతున్నందుకే తనను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

తాను వేసిన ప్రశలకు సమాధానం చెప్పలేక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.. మూడు నెలలకోసారి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్ ని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని, ఒక వేల అలా చేస్తే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గత చరిత్ర గురించి కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు.

తనకు దేవుడు కనిపిస్తే భక్తితో దండం పెట్టుకోవడం మొదటి నుంచీ ఉన్న అలవాటు అని చెప్పారు. దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయాలు చేయడం ఒక్క రేవంత్ రెడ్డికే తెలిసిన విద్య అని విమర్శించారు. ఆధ్యాత్మిక భావనతో తమిళనాడులోని తిరుచ్చిలో శ్రీరంగనాథస్వామి దేవాలయానికి వెళ్లానని, అలాగే కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు శివమొగ్గ ఎయిర్‌పోర్టుకు వెళ్లానని తెలిపారు.

దేవుడి దర్శనం కోసం తాను గుడికి వెళ్లడం కూడా ముఖ్యమంత్రికి తప్పుగా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. తాను ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సమయంలో ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు తనను గుర్తుపట్టి ఫోటోలు తీసుకున్నారని, అభిమానంతో తనతో కలిసి ఫోటోలు కూడా దిగారని చెప్పారు. కానీ తాను అక్కడ ఏవో పూజలు చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని, నిజంగా తాను అలాంటి పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్ చేశారు. తన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీయాలనే కుట్రతోనే పూజల డ్రామా ఆడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.

ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే తన పేరు చెప్పి ఆరోపణలు చేయాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి తన పేరు చెబితే వెంటనే లీగల్ నోటీసు పంపడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే చట్టానికి, లీగల్ నోటీసులకు భయపడే ఆయన తన పేరు చెప్పకుండా పరోక్షంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను అగ్గిపెట్టెతో పోలుస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 370 కేసులు ఉన్నాయని, మెదక్ జైలులో మూడు రోజులు ఉన్నానని, రైలు రోకో సమయంలో 48 గంటలు కంకర రాళ్లపైనే పడుకున్నానని చెప్పారు. ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచల్లా విసిరికొట్టి ఉద్యమం చేశామని అన్నారు. మిలియన్ మార్చ్ సమయంలో ఈత రాకపోయినా తెలంగాణ కోసం హుస్సేన్ సాగర్‌లోకి దూకానని తెలిపారు.

మానుకోటలో బుల్లెట్లు పడుతున్న సమయంలో రక్తపు మడుగులో ఉన్నవారిని తన భుజాలపై ఎత్తుకుని ఆసుపత్రికి పరుగెత్తిన చరిత్ర తనదని చెప్పారు. ఉద్యమ సమయంలో వందలసార్లు ఢిల్లీ హైకోర్టు చుట్టూ తిరిగానని హరీష్ రావు గుర్తు చేశారు. తన పోరాటాన్ని, త్యాగాలను చూసిన ప్రజలు తెలంగాణలో ఎవరికీ రానంత మెజార్టీతో ఏకంగా లక్షా 20 వేల ఓట్లతో తనను గెలిపించారని తెలిపారు. తనపై పోటీ చేసిన ప్రత్యర్థులకు ఏడుసార్లు డిపాజిట్లు రాకుండా చేసిన చరిత్ర తనదని చెప్పారు.

#Telangana#BRS#Harish Rao#sensational comments#Revanth government#Four Brothers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి