ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు పోలీసులు అతడిని విచారించనున్నారు.
కేసులో కీలక అంశాలపై మరింత సమాచారం రాబట్టేందుకు ఈ కస్టడీని పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డికి స్పెర్మ్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకున్నట్టైంది.
మరోవైపు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి చేసిన ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులు, స్టాకింగ్, డిజిటల్ దుర్వినియోగం వంటి పలు ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి ఖండించారు.
ఈ పరిణామాల మధ్య ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందడం, ఆ తర్వాత అరెస్ట్ కావడం, ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు.
ఇప్పుడు మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతి రావడంతో.. 18, 19 తేదీల విచారణలో పోలీసులు ఏ అంశాలపై ప్రశ్నించబోతున్నారు? స్పెర్మ్ టెస్ట్ ద్వారా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభిస్తాయి? ఈ కేసులో ఆరోపణలకు సంబంధించిన కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా? అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.


