DC Movie: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి కొన్ని విషయాలలో అసలు ఇగో ఉండదని ఇప్పటికే పలుమార్లు ప్రువ్ అయింది. దర్శక నిర్మాతలకి కూడా అంతే. ఒక భాషలో గనక సినిమా హిట్ అయితే, ఆ చిత్ర బృందాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ విషయంలో ముందు మన మెగాస్టార్ ఉంటారు. మన తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చిన సినిమా కంటెంట్ బావుంటే శుభాకాంక్షలు తెలుపుతుంటారు.
ఇటీవల వచ్చిన తమిళ సినిమా డీసీ. తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే లోకేష్‌కి హీరోగా విపరీతమైన పేరొచ్చింది. ఈ మూవీలో తన నటనకి విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు, మన టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్ళు పొగడ్తలతో ట్వీట్స్ పెడుతున్నారు.
మహేష్ బాబు:
రీసెంట్ గా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘డీసీ’ చిత్రం చూశారు. ఆ తర్వాత ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఇదొక ఒరిజినల్, ఔట్‌స్టాండింగ్ మూవీ. సినిమాలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను” అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చిత్ర బృందానికి మంచి బూస్ట్ ఇవ్వడమే కాదు, ఫ్యాన్స్ కి కూడా మంచి ఉత్సాహాన్నిచ్చింది. మహేష్..ఒక సినిమా గురించి కామెంట్స్ చేయడం చాలా అరుదు.
అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియా హ్యాండిల్ (ఎక్స్) లో చేసిన కామెంట్స్ ఇప్పుడు డీసీపై మరోసారి ఆసక్తిని రేకెత్తించాయి. “డీసీ మూవీ చూశాను. ఇదో తమిళ్ క్లాసిక్.. అర్థం చేసుకున్న వాళ్ళకి ఇదొక దృశ్య కావ్యం. ఈ చిత్రాని ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌పై తన గౌరవాన్ని వ్యక్తం చేశాడు అల్లు అర్జున్. అంతేకాదు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను ‘మాస్టర్ బూస్టర్’గాను అభివర్ణించారు. హీరోయిన్ వామికా గబ్బిని గొప్పగా ప్రశంసించాడు.


