హైదరాబాద్ అంటే ట్రాఫిక్!.. ట్రాఫిక్ అంటే హైదరాబాద్!.. నరకం ఎక్కడో ఉండదు.. నగరంలో ట్రాఫిక్ లో చిక్కుకుంటే చాలు ఇక్కడే కనిపిస్తుంది. అనే మాటలు తరచుగా నగర వాసుల నోటి నుండి వినిపిస్తాయి.. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇంతగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవి కావని.. సాఫ్ట్ వేర్ కంపెనీలు నగరంలో కొలువుదీరాక పెరిగితే.. కోవిడ్ తర్వాత ఈ ట్రాఫిక్ ఊహించని స్థాయిలో పెరిగిందనే ఆరోపణలున్నాయి..
మరో వైపు నగరంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం.. సిటీ నలువైపులా విస్తరిస్తుండటం.. ఇందుకు అనుగుణంగా రోడ్లు, రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కీలకమైన మార్గంలో ట్రాఫిక్ మార్పుకు రంగం సిద్ధమైంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది.
ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, వాహనాల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 13 లేన్ ఛేంజర్లు, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్‌తో పాటు స్పష్టమైన సైన్‌బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించనున్నారు.
మరోవైపు కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్స్, విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా ఈ వన్‌వే ట్రాఫిక్ విధానం దాదాపు రెండేళ్లపాటు కొనసాగనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.. కాబట్టి వాహనదారులు ముందుగానే కొత్త ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకోవాలని.. అధికారులు సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ కోరారు.
ఇక వాహనదారులు వన్ వే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని తమ ప్రయాణాల ప్రణాళికను సిద్దం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కొత్త ట్రాఫిక్ విధానానికి వాహనదారులు సహకరించాలని తెలిపిన వారు.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఇక ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనుల వల్ల కేబీఆర్ పార్క్ చుట్టూ ఇకపై కేవలం వన్‌వే లో మాత్రమే ప్రయాణించాలి.
ఇక నుండి ఎదురెదురుగా వెళ్లడం కుదరదు!.. ప్రయాణ దిశ మార్చుకోవడానికి బిఆర్ఎస్ భవన్, ఒమేగా హాస్పిటల్, తాజ్ మహల్ హోటల్ వంటి 10 ప్రాంతాల్లో యూ-టర్న్‌లు ఇచ్చారు. అలాగే రోడ్ నెం. 36, 45, జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్లేందుకు 13 ఎగ్జిట్‌లను కేటాయించారు.
కాగా మారిన ఈ రూట్లను ఇప్పటికే గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్ చేశారు. కాబట్టి అనవసర జరిమానాలు, ట్రాఫిక్ జామ్‌ల బారిన పడకుండా మ్యాప్ చూసుకుంటూ జాగ్రత్తగా ప్రయాణించండని అధికారులు సూచిస్తున్నారు.. మిగతా వివరాలకు ఈ కిందనున్న వీడియో చూడగలరు..


