Toll Free Number: 22ఏ నిషేధిత భూముల అంశం తీవ్ర వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి.. 22A నిషేధిత భూముల జాబితాపై కీలక ప్రకటన చేశారు.
ముమ్మాటికీ మా తప్పిదమే
22ఏ నిషేధిత భూముల జాబితాను అప్‌డేట్ చేయడంలో పొరపాటు జరిగిందని మంత్రి పొంగులేటి అంగీకరించారు. పొరపాటున కొందరు ప్రైవేట్ వ్యక్తుల భూములు 22A నిషేధిత భూముల లిస్టులో పడ్డాయని, ఇది తమ అధికారుల తప్పిదమే అని వెల్లడించారు. ఇందుకు అధికారుల తరపున భూ బాధితులకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎవరి భూములను లాక్కోదని మంత్రి పేర్కొన్నారు. 22A నిషేధిత లిస్టులో చేర్చిన భూముల్లో న్యాయబద్దమైన వాటిని త్వరలోనే తొలగిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
మొత్తం 750 దరఖాస్తులు
ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు. తమ ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత భూముల లిస్టులో పెట్టారని మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. నిషేధిత జాబితాలో ప్రాపర్టీలు ఉన్న వాళ్లు ఆందోళన చెందొద్దని కోరారు. యూఎల్సీలో క్లియర్ అయిన ప్రాపర్టీలని నిషేధిత జాబితా (22-A)లో చేర్చడం ముమ్మాటికే మా అధికారుల తప్పిదమే అన్న మంత్రి పొంగులేటి.. ఇందుకుగాను క్షమాపణలు కోరారు. జరిగిన పొరపాట్లను సరి చేస్తున్నామన్న ఆయన.. సమస్యని పరిష్కరించేలా చర్యలు చేపట్టామని వివరించారు.
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్
నిషేధిత భూముల జాబితా కారణంగా ప్రైవేట్ ఆస్తుల యజమానులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూముల గురించి వారిలో అనేక అనుమానాలు, ఆందోళనలు, భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించింది. నిషేధిత భూముల జాబితా అంశంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే భూ యజమానులు టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788 కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి పొంగులేటి సూచించారు.


