దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్న అంశాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఒకటి. ముఖ్యంగా 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో వస్తున్న E20 పెట్రోల్‌పై వాహనదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఆటోమొబైల్ కంపెనీలు సైతం కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసినట్లు చర్చ జరుగుతోంది.
అయితే ఈ విధానం వల్ల అసలు లాభపడేది ఎవరు? భారం పడేది ఎవరిపై? సామాన్య వాహనదారులకు దీని ప్రభావం ఎంత? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు వాహనదారులే E20 పెట్రోల్ వల్ల నేరుగా నష్టపోతున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇథనాల్‌లో ఉండే కెలొరిఫిక్ విలువ స్వచ్ఛమైన పెట్రోల్ కంటే సుమారు 36 శాతం తక్కువగా ఉంటుంది. దీనివల్ల సాధారణ పెట్రోల్‌తో వచ్చే మైలేజ్‌తో పోలిస్తే.. E20 వాడినప్పుడు కనీసం 8 శాతం వరకు మైలేజ్ పడిపోతుందని అంటున్నారు. అదీగాక ఈ మైలేజ్ భారం వాహనదారుని మీద ఆర్థికంగా పడుతుంది.
అలాగే పాత మోడల్ వాహనాలపై E20 పెట్రోల్ ప్రభావం మరింతగా కనిపిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా BS-IV, అంతకంటే పాత వాహనాల్లోని రబ్బరు పైపులు, సీల్స్, ఫ్యూయల్ పంపులపై ఇథనాల్ మిశ్రమ ఇంధనం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వాహనాల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదీగాక వాహనాలు తరచూగా రిపేర్ కు వస్తుండటంతో మెకానిక్‌ల దగ్గరికి తిరగవలసి వస్తుందని దీంతో జేబులపై అదనపు భారం పడుతోందని మండిపడుతున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే ద్విచక్ర వాహనాల మరమ్మతులకు రూ.3 వేల వరకు, కార్లకు రూ.6 వేలకుపైగా ఖర్చవుతోందని వాహనదారులు వాపోతున్నారు.
పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్‌నే ఎక్కువగా అందుబాటులో ఉంచడంతో ప్రత్యామ్నాయం లేక ఆ పెట్రోల్ పోయించుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు. మరోవైపు ఇథనాల్ తయారీకి చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులను ముడిసరుకుగా వాడుతున్నారు.
ఈ విధానం వల్ల రైతులకు నేరుగా భారీ లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. చెరకు రైతులు ఎప్పట్లాగే మద్దతు ధరకు మిల్లులకు విక్రయిస్తున్నారు తప్ప.. ఇథనాల్‌తో వారికి అదనపు ఆదాయం రావడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఇక మొక్కజొన్నలను నేరుగా ప్రభుత్వానికి కాకుండా డిస్టిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఉర్జాదాతలుగా మారుతున్నప్పటికీ.. మార్కెట్లో లభించే ధరలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.. మరోవైపు మొక్కజొన్న సాగు పెరగడం వల్ల పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు తగ్గిపోతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంటే వీటిని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం పెరుగుతోంది. ఇక్కడ క్రూడ్ దిగుమతులకు బదులుగా ఎక్కువ విలువ కలిగిన వంటనూనెలు, పప్పుధాన్యాలు దిగుమతులు పెరుగుతున్నాయని తెలుస్తుంది. కాబట్టి E20 పెట్రోల్ వాడటం వల్ల రైతులకు గానీ, వాహనదారులకు ఎలాంటి ప్రయోజనం లేదని తేలింది.. ఇక ఇథనాల్ బ్లెండింగ్ విధానం ద్వారా డిస్టిల్లరీలు, పెట్రోలియం కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతోందనే ఆరోపణలున్నాయి.
ప్రభుత్వం నుంచి హామీతో కూడిన కొనుగోలు ఒప్పందాలు, వివిధ రాయితీలు లభించడంతో డిస్టిల్లరీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నాయని.. ప్రస్తుతం దేశీయ అవసరాల కంటే ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండటంతో.. డిస్టిల్లరీలు E20 విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్నాయనే చర్చ సాగుతోంది.
మరోవైపు, దేశీయంగా అవసరమైన స్థాయిలో ముడిసరుకు అందుబాటులో లేకపోవడంతో మొక్కజొన్నతో పాటు ఇథనాల్‌ను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విదేశీ మారకద్రవ్యంపై అదనపు భారం పడుతోంది.
అంటే.. ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడితే, ఇప్పుడు ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇథనాల్ పర్యావరణ పరంగా ఉద్గారాలను తగ్గిస్తుందనే వాదన ఉన్నప్పటికీ.. దీనివల్ల ఆహార భద్రత, నీటి వనరుల వినియోగం, వాహనాల నిర్వహణ వంటి అనేక ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చైనా సహా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. భారతదేశంలో కూడా ఈవీల వాడకం క్రమంగా పెరుగుతోంది. అందుకే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం దేశం భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
అలాగే ఇథనాల్ వినియోగంతో క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతున్నప్పటికీ, వాటి స్థానంలో వంటనూనెలు, పప్పుదినుసులు, మొక్కజొన్న వంటి ఇతర ఉత్పత్తుల దిగుమతులు పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మొత్తం దిగుమతి భారం తగ్గుతుందన్న వాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు E20 పెట్రోల్ విధానం వల్ల ఇథనాల్ తయారీ సంస్థలు, ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
అదేవిధంగా వాహనాల నిర్వహణ, మరమ్మతుల అవసరం పెరిగితే ఆటో స్పేర్స్, సర్వీసింగ్ రంగాలకు కూడా అదనపు వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయని చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే.. E20 విధానం వల్ల నిజంగా లాభపడేది ఎవరు? భారం మోసేది ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న దిగుమతి భారం తగ్గుతాయ్ అనేది ఊహాజనితమైన కల్పనని తేలిపోయింది...


