తెలంగాణ

తెలంగాణలో ఓటర్ లిస్ట్‌పై అసలు గేమ్ స్టార్ట్.. కాంగ్రెస్‌కు SIR టెన్షన్.. BRS, BJP వ్యూహమేంటి?

రచన: Kashi••8 నిమిషాల పఠనం

SIRకు ముందు తెలంగాణలో 3.38 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉండగా.. దాదాపు 73.39 లక్షల ఎలక్టర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు ‘అన్‌కలెక్టబుల్‌’గా గుర్తించారు. ఇందులో చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు, అందుబాటులో లేని వారు, డూప్లికేట్ ఓటర్లు వంటి విభాగాలు ఉన్నాయి.

తెలంగాణలో ఓటర్ లిస్ట్ గేమ్ మొదలైందా?

మూడు పార్టీలకు కొత్త టెన్షన్!

డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలు విడుదల

73.39 లక్షల ఓట‌ర్ల వివ‌రాలు అన్‌క‌లెక్ట‌బుల్..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నా.. ఓటర్ లిస్ట్ మాత్రం ఇప్పటి నుంచే రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌—SIR ప్రక్రియలో భాగంగా సోమవారం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలు విడుదలయ్యాయి. దాదాపు 2.65 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన వివరాలతో ఈ జాబితాలు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు అవకాశం ఉంది.

73.39 ల‌క్ష‌ల ఓట్లు గ‌ల్లంతు..?

అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. SIRకు ముందు తెలంగాణలో 3.38 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉండగా.. దాదాపు 73.39 లక్షల ఎలక్టర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు ‘అన్‌కలెక్టబుల్‌’గా గుర్తించారు. ఇందులో చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు, అందుబాటులో లేని వారు, డూప్లికేట్ ఓటర్లు వంటి విభాగాలు ఉన్నాయి. అందువల్ల ఈ సంఖ్య మొత్తం ఓట్ల తొలగింపుగా చూడటం సరికాదు. అభ్యంతరాలు, పరిశీలన, క్లెయిమ్‌ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఫైన‌ల్ పిక్చ‌ర్ వ‌స్తుంది.

రాజ‌కీయ పార్టీల్లో టెన్ష‌న్

రాజకీయ పార్టీలకు మాత్రం ఇది సాధారణ పరిపాలనా ప్రక్రియ కాదు. ప్రతి ఓటు ఒక రాజకీయ లెక్క. ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేస్తాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్, BRS, BJP సహా అన్ని పార్టీలు తమ తమ స్థాయిలో ఓటర్ జాబితాపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర ఇప్పుడు మరింత కీలకంగా మారనుంది.

సీఎం రేవంత్ రెడ్డి కూడా SIR విషయంలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగితే ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న రాజకీయ వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో BRSకు కూడా ఇది కీలక రాజకీయ అంశంగా మారే అవకాశముంది. గతంలో తనకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతాల్లో ఎవరెవరి పేర్లు జాబితాలో ఉన్నాయో.. ఎవరి పేర్లు కనిపించడం లేదో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఓటర్ లిస్ట్ అంశం మరో ఆయుధంగా మారొచ్చు.

ఇక BJP కూడా ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. తెలంగాణలో బూత్ స్థాయి రాజకీయ బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టిన ఆ పార్టీకి SIR ప్రక్రియ మరో పరీక్షగా మారనుంది. ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు ఉండేలా చూడటం, తొలగింపులపై అభ్యంతరాలు నమోదు చేయడం, కొత్త ఓటర్లను గుర్తించడం వంటి అంశాల్లో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

ఓట‌ర్లాలా.. మేల్కోండి!

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు.. సాధారణ ఓటరే. డ్రాఫ్ట్ లిస్ట్‌లో తన పేరు ఉందా? పేరు, వయసు, చిరునామా వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయా? పేరు లేకపోతే క్లెయిమ్ ఎలా చేయాలి? ఇవన్నీ ప్రతి ఓటరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఓటు హక్కు కేవలం ఒక ఎన్నికల గుర్తింపు కాదు.. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి పొలిటిక‌ల్ వాయిస్.

ప్రస్తుతం సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి తుది ఓటర్ జాబితా దిశగా ప్రక్రియ కొనసాగుతుంది. అందువల్ల ఇప్పుడు వచ్చిన డ్రాఫ్ట్ జాబితానే ఫైనల్ లిస్ట్ అని భావించాల్సిన అవసరం లేదు. తుది జాబితా వెలువడే వరకు అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది.

పార్టీల లెక్క‌లు తారుమారు?

ఇక్కడే తెలంగాణ రాజకీయాల్లో అసలు ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. ఓటర్ లిస్ట్ మారితే.. రాజకీయ లెక్కలు కూడా మారతాయా? ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు తగ్గారు? ఎక్కడ కొత్త ఓటర్లు చేరారు? ఏ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఓటర్ల పేర్లు పెండింగ్‌లో ఉన్నాయి? పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీల వ్యూహాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలో నాయకులు ప్రజల దగ్గరకు వెళ్తారు. కానీ ఈసారి ఎన్నికలకు చాలా ముందుగానే రాజకీయ పార్టీలు ఓటర్ లిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బూత్‌ బూత్‌కు వెళ్లి జాబితాను పరిశీలించడం.. ప్రతి ఓటును ధృవీకరించడం.. అర్హులైన వారి హక్కును కాపాడటం.. ఇదే ఇప్పుడు పార్టీలకు కొత్త టాస్క్.

మొత్తానికి తెలంగాణలో SIR కేవలం ఓటర్ లిస్ట్ సవరణ ప్రక్రియగానే మిగిలిపోతుందా? లేక 2028 అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సమీకరణాలకు ఇప్పటి నుంచే పునాది వేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి సమాధానం చెప్పడం తొంద‌ర‌పాటే అవుతుంది. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం. తెలంగాణ రాజకీయాల్లో ఓటర్ లిస్ట్ ఇప్పుడు కేవలం అఫీషియ‌ల్ పేప‌ర్ కాదు.. రాబోయే రాజకీయ పోరాటానికి ఒక కీలక అస్త్రంగా మార‌బోతోంది.

#Telangana Politics#Telangana Voter List#SIR Telangana#Congress Telangana#BRS Telangana#BJP Telangana#Telangana Elections#Voter List#Electoral Roll#Telangana Political News#Telangana News#Indian Politics#Election Commission#Telangana SIR#Political Analysis
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి