రెవెన్యూకు సిగ్గుండాలి!
మంత్రులకు మానం ఉండాలి?
బాంచన్ దొర అని అడుక్కోవాలా?
సారీ చెబితే సిస్టమ్ మారుతుందా?
- 70 ఏండ్ల క్రితం దున్నేటోడిదే భూమి!
- ఈనాడు ఉండే ఇళ్లకు కూడా గ్యారెంటీ లేదా?
- టైటిల్ గ్యారెంటీ పేరుతో మీరు చేస్తున్న దోపిడీ ఇక చాలు?
- ప్రభుత్వ భూములకు లెక్కలు మీరు చెబితే కాదు
- తెలంగాణ చరిత్ర ఏంటో తెలుసుకుని మార్చండి
- మీ కమీషన్స్ కోసం మార్చింది చాలు?
- పాలించేది ఎవరైనా సంపద మాత్రం భూముల పైనేనా?
- బీఆర్ఎస్ దొరల భూ మాయను.. మీ పటేళ్లు కొనసాగించొద్దు?
- మాకు లేని భూములను, ఇళ్లను అడగడం లేదు.. ఉన్నవాటి జోలికి రావొద్దు
- మీరు సారీ చెబితే ఒడిసే ముచ్చట కాదు ఈ వ్యవహారం
- ఈరోజు మీరు.. తర్వాత మరో దొర పుట్టుకొస్తాడు?
- చట్టపరంగా ఏం చేస్తారో చెప్పండి
- మీకు 30 నుంచి 50 శాతం వాటా మేము ఇవ్వేలేం సార్?
- తెలంగాణ భూముల్లో రాజకీయ నాయకుల డ్రామాలపై స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్
భూమిపై వార్తలు అంటే బ్లాక్ మెయిల్‌లా సృష్టించారు
ప్రపంచంలో ఏ యుద్ధం అయినా భూమి కోసమే జరిగింది. భూ సరిహద్దుల కోసమే రాజ్యాలు కూలిపోయాయి. నిలబడ్డాయి. భూమిని ఎవరు ఎలా అనుభవించాలో కాలానుకూలంగా చట్టాలు తయారు చేశారు. తెలివితో చంద్ర మండలంపై కూడా ప్లాట్లు అమ్మే ఈ రోజుల్లో జీవితాంతం కష్టపడుతూ ఈఎంఐలు కట్టుకుంటూ సొంతిల్లు కొనుగోలు చేసుకున్నా కనీసం అది అమ్ముకునే హక్కు కూడా లేదని చెబితే ఎలా అని ప్రశ్నించే స్థితి వచ్చింది.
ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. నాయకులకు తెలిసే జరిగిన వ్యవహారమేనన్న ఆరోపణలు ఉన్నాయి. కావాలనే భూస్వాములు, పెత్తందారులు కొత్త చట్టాల్లోని లొసుగులను గుర్తించి ఎలా పైకి వచ్చారో.. గత ఆరేళ్ల క్రితం ధరణి పేరుతో పుట్టుకొచ్చిన పుత్రిక కూడా పేదల జీవితాల్లో, వారి కష్టార్జిత భూముల్లో చీకటి రోజులను తీసుకొచ్చిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన దోపిడీ విలువ రూ.40 వేల కోట్లు అయితే.. ధరణి పేరుతో కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన భూ దోపిడీ విలువ దానికి పదింతలు ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.
ప్రజల కోసం 30 ఏళ్లపాటు పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారులు.. కేవలం మూడేళ్లు పనిచేస్తే చాలని భావించి, వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ఎలా ప్రైవేటుపరం చేశారో రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన ప్రొహిబిటెడ్ లిస్టులో.. గతంలో వేల కోట్ల విలువైన భూ దందాలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూములు ఉన్నాయా? ఉంటే.. సంబంధిత వ్యక్తులు ఎందుకు ముందుకు రావడం లేదు?
వంశీరామ్‌కో, కూకట్‌పల్లిలోని ఇండస్ట్రీయల్ ల్యాండ్స్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫీనిక్స్ కంపెనీకో, మై హోమ్‌కో, మరో రాఘవకో.. ఎందుకు ప్రభుత్వ భూముల విషయంలో ఇలాంటి సమస్యలు రావడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చరిత్రలో ఎప్పుడైనా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కూకట్‌పల్లిలోని ఇండస్ట్రీయల్ ల్యాండ్స్‌ను అగ్రికల్చర్ భూములుగా మార్చిన సందర్భాలు ఉన్నాయా? కానీ ధరణి వచ్చిన తర్వాతే అది సాధ్యమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే.. ఇదే నిబంధనలు పెద్దల సొంత భూములకు ఎందుకు వర్తించడం లేదు? పేదల భూములపైనే ఎందుకు రెవెన్యూ శాఖ దృష్టి పడుతోంది, రెవెన్యూ మంత్రి గారూ? వారు మీరు కోరుకున్న 30 శాతం నుంచి 50 శాతం వాటా ఇవ్వలేదనే కారణంతోనేనా? అనే తీవ్ర ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అదేవిధంగా కొందరు వ్యక్తుల జీవితం చిన్న స్థాయి రాజకీయ నాయకుడిగా మొదలై, అవినీతి అక్రమాలతో కొద్ది కాలంలోనే వేల కోట్లు వెనుకేసి... చివరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను సొంతం చేసుకుంటున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఇలాంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులు, ప్రజా సంఘాలపై ఆధారం లేని ఆరోపణలు కొందరు నాయకులు చేస్తున్నారు.. అవినీతికి సంబంధించిన వార్తలు బ్లాక్‌మెయిల్ కోసం రాస్తున్నారని, ప్రచారం కోసం ఆరోపణలు చేస్తున్నారని ముద్ర వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ.. ఎంతకాలం పబ్బం గడుపుతారు.
సాల్ దొర, మీ బాంచన్ బతుకులు చూడలేకపోతున్నాం
మరోవైపు రెవెన్యూ వ్యవహారాలపై అందరికీ పూర్తిస్థాయిలో అవగాహన ఉండదు. ముఖ్యంగా భూమిని తరతరాలుగా అనుభవిస్తున్న వారికి కూడా రెవెన్యూ రికార్డుల్లో ఏం జరుగుతుందనే దానిపై పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. తమ భూమిలో తామే పొజిషన్ లో ఉన్నంతకాలం.. నా భూమిని ఎవరు ఎత్తుకెళ్తారు? అనే ధోరణిలో చాలామంది ఉంటారు. ఎందుకంటే.. తాము ఉన్న భూమిని, తాము కట్టుకున్న ఇళ్లను దైవంగా భావిస్తారు.
వాటిని కాపాడుకోవడానికి పన్నులు సైతం క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో.. ఊళ్లకు ఊళ్లు, 50 ఏళ్లకు పైగా వ్యవసాయం చేసుకుంటున్న గ్రామాలను సైతం ప్రొహిబిటెడ్ లిస్టులో పెడతామంటే ప్రజలు ఎలా అంగీకరిస్తారు? 30 ఏళ్ల క్రితమే ఇల్లు నిర్మించుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి.. ఇది మీ భూమి కాదు.. దీన్ని ఎలా అమ్ముకుంటారు? అని ఓ అధికారి ప్రశ్నిస్తే ఆ కుటుంబానికి ఎలా ఉంటుందో.. అలాంటి పరిస్థితి మీ ఇంటి గడప దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు మాత్రమే అర్థమవుతుంది.
ఇది ఒక్క హైదరాబాద్‌లోని కామన్ పబ్లిక్ సమస్యగా మాత్రమే చూడకండి. మారుమూల గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుని.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. భూమి అనేది కేవలం ఓ రికార్డులోని సర్వే నంబర్ కాదు.. అది ఒక కుటుంబం తరతరాలుగా కూడబెట్టుకున్న ఆస్తి, వారి భవిష్యత్తు. అందుకే.. ఇలాంటి వ్యవహారాల్లో పారదర్శకత, న్యాయం, ప్రజలకు స్పష్టమైన సమాధానాలు ఉండాలి.
నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన భూములపై పరిష్కారానికి ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయస్థానాలు ఇప్పటికే వివిధ సందర్భాల్లో స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేదంటే.. ఇలాంటి ఆటలు ఇక సాగవు అంటూ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ అసంతృప్తి చాపకింద నీరులా విస్తరించి.. జెన్-జీ ఉద్యమాల తరహాలో ప్రజలు నిలదీసే పరిస్థితి రావొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత పాలకులపైనే ఉంటుంది. తమ చర్యల వల్ల ప్రజలకు అన్యాయం జరిగిందనే భావన కలగకుండా.. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించాలని స్వేచ్ఛ న్యూస్ కోరుతోంది.


