నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ ముందుచూపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఏడు టీఎంసీలు. కానీ భారీగా పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం నిల్వ చేసుకోగలిగేది సుమారు మూడున్నర టీఎంసీల నీరే. ఫలితంగా భారీ వరద వచ్చినా ఆ నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఇటీవల కడెం ప్రాజెక్టులోకి ఏకంగా లక్షల క్యూసెక్కుల వరద చేరింది. 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. అంటే ప్రాజెక్టు నిండినా నీరు మిగలని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రాజెక్ట్ ల్లో వాటర్ నిండకుంటే ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం.. నీరు ఉన్నప్పుడే దాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడంలో ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కడెం రిజర్వాయర్ ఎగువన దాదాపు 15 నుంచి 18 కిలోమీటర్ల మేర పూడిక పేరుకుపోయినట్లు గతంలోనే సర్వేలు వెల్లడించాయి. పూడిక తొలగింపునకు కంపెనీని ఎంపిక చేసి ఏడాది గడుస్తున్నా ప్రాసెసింగ్ యూనిట్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించినా, వాటిని కంపెనీకి అప్పగించకపోవడంతో జాప్యం కొనసాగుతోంది.
ఇక్కడే ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. వర్షాలు రాకముందే పూడికతీత పనులు పూర్తిచేసి ఉంటే.. వరద నీటిని మరింతగా నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. నీరు వచ్చిన తర్వాత గేట్లు ఎత్తి వదిలేయడం కంటే, నీరు రాకముందే రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కడెం ఆయకట్టు కింద దాదాపు 68 వేల ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే కొనసాగితే వానాకాలం చివర్లో, రబీ సీజన్‌లో సాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇక కడెం పూడికతీత, ప్రాసెసింగ్ పనులను రాజస్థాన్‌కు చెందిన ఈతర్ కంపెనీ దక్కించుకుంది. టన్ను పూడిక మట్టికి రూ.407 ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. 20 ఏండ్లపాటు ఈ పనులు నిర్వహించనుంది. 100 ఎకరాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేసి.. 20 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్, 80 ఎకరాల్లో సిల్ట్ నుంచి ప్రాసెసింగ్ చేసిన ఇసుక, మట్టి నిల్వలను వేర్వేరుగా స్టాక్ పాయింట్ పేరిట ఉంచనున్నారు.
ఇందుకుగాను ప్రాజెక్టు సమీపంలో స్థలం కోసం అన్వేషించిన అధికారులు కడెం మండలంలోని ఎర్వచింతల, రేవోజిపేట, సోమవార్ పేట గ్రామాల లో భూములను గుర్తించారు. కానీ ఈ భూములను ఇప్పటివరకు సంబంధిత కంపెనీకి కేటాయించకపోవడంతో యూనిట్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. కాగా ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కడెం ప్రాజెక్టును సందర్శించి.. ప్రాజెక్టులోని నీటి నిల్వ సామర్థ్యం, పూడిక సమస్యను సంబంధిత ఇరిగేషన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. పూడిక సమస్యపై కలెక్టర్ మంత్రికి వివరించడంతో వెంటనే పూడికతీత పనులను మొదలుపెట్టాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.
మరోవైపు నీటి కొరత వచ్చినప్పుడు పరిష్కారాల కోసం పరుగులు పెట్టడం కంటే.. నీరు ఉన్నప్పుడే ప్రతి చుక్కను నిల్వ చేసుకునేలా ప్రణాళిక రూపొందించడం ప్రభుత్వ బాధ్యత. కడెం ప్రాజెక్టు విషయంలో ఇకనైనా మాటలు కాకుండా పనులు మొదలై, పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యాన్ని తిరిగి సాధించే చర్యలు వేగంగా జరగాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


