క్రైమ్

Visakhapatnam: ఒక్క ఫోన్ కాల్.. 1.5 కోట్లు మాయం!..

రచన: Venu•••6 నిమిషాల పఠనం

విశాఖకు చెందిన వృద్ధ దంపతులకు సైబర్ నేరగాళ్లు టెలికాం, పోలీస్, ఈడీ, సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేశారు. వారి పేరుతో అక్రమంగా సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉపయోగిస్తున్నారని, ఈ కేసులో అరెస్టు చేస్తామని భయపెట్టారు. ఆ తర్వాత ఆర్బీఐ ఫండ్ వెరిఫికేషన్ పేరుతో బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును తమకు చెప్పిన ఖాతాలకు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు.

విశాఖపట్నంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ అరెస్టు పేరుతో 76 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి దంపతులను బెదిరించిన సైబర్ నేరగాళ్లు.. వారి జీవితకాల పొదుపు అయిన దాదాపు రూ.1.5 కోట్లను కాజేశారు. ఈ కేసులో కేరళకు చెందిన ఓ కమీషన్ ఏజెంట్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన వృద్ధ దంపతులకు సైబర్ నేరగాళ్లు టెలికాం, పోలీస్, ఈడీ, సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేశారు. వారి పేరుతో అక్రమంగా సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఉపయోగిస్తున్నారని, ఈ కేసులో అరెస్టు చేస్తామని భయపెట్టారు. ఆ తర్వాత ఆర్బీఐ ఫండ్ వెరిఫికేషన్ పేరుతో బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును తమకు చెప్పిన ఖాతాలకు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు.

వారి మాటలు నమ్మిన బాధితులు తమ జీవితకాల పొదుపు మొత్తం రూ.1,46,50,520ను వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం మోసం జరిగినట్లు గుర్తించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు ప్రారంభమైంది. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 16న ఐసీఐసీఐ బ్యాంకు చందానగర్ శాఖలోని ఓ ఉమ్మడి ఖాతాకు రూ.29.20 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు.

కేవైసీ, మొబైల్ నంబర్ వివరాల ఆధారంగా ఆ ఖాతా కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన పీఎం షబ్బీర్, 40,కు చెందినదిగా గుర్తించారు. పోలీసులు షబ్బీర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. విచారణలో అధిక కమీషన్ ఆశతో తన బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లకు షబ్బీర్అందించినట్లు పోలీసులు తెలిపారు. తన ఖాతా ద్వారా సుమారు రూ.92 లక్షల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు.

ఇక ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న ప్రమాదకరమైన మోసాల్లో డిజిటల్ అరెస్టు ఒకటి. ఇందులో నిందితులు ముందుగా బాధితులకు ఫోన్ చేస్తారు. తాము పోలీస్, సీబీఐ, ఈడీ, టెలికాం శాఖ, ఆర్బీఐ వంటి ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులమని పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత మీ పేరుతో మనీలాండరింగ్ కేసు ఉందని, మీ బ్యాంకు ఖాతా నేరాల్లో ఉపయోగించారని లేదా మీ మొబైల్ నంబర్ అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించారని చెబుతారు.

అరెస్టు తప్పించుకోవాలంటే వీడియో కాల్‌లో ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని, బ్యాంకు ఖాతాలోని డబ్బును వెరిఫికేషన్ కోసం మరో ఖాతాకు పంపాలని ఒత్తిడి చేస్తారు. కొన్నిసార్లు పోలీస్ యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులు, ప్రభుత్వ కార్యాలయాల మాదిరి బ్యాక్‌గ్రౌండ్‌తో వీడియో కాల్స్ చేసి బాధితులను మరింత భయపెడుతున్నారు. భయంతో బాధితులు ఆలోచించే అవకాశం కోల్పోవడమే నేరగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారింది.

అయితే ఇక్కడ కొన్ని ప్రధానమైన విషయాలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.. పోలీసులు, సీబీఐ, ఈడీ, ఆర్బీఐ వంటి సంస్థలు వీడియో కాల్‌లో డిజిటల్ అరెస్టు చేసి డబ్బు బదిలీ చేయమని ఆదేశించవు. ఎవరైనా ఇలాంటి డిమాండ్ చేస్తే వెంటనే అప్రమత్తం కావాలి.. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కేసులు, అరెస్టులు, మనీలాండరింగ్ అంటూ బెదిరిస్తే భయపడకండి. వారి మాటలకు అనుగుణంగా డబ్బు బదిలీ చేయవద్దు. OTP, ATM PIN, CVV, బ్యాంకు పాస్‌వర్డ్‌లు, ఆధార్ లేదా ఇతర కీలక వివరాలను తెలియని వ్యక్తులకు చెప్పవద్దని పేర్కొంటున్నారు.

కాగా ఇప్పటికే డబ్బు బదిలీ చేసి ఉంటే ఆలస్యం చేయకుండా బ్యాంకును సంప్రదించి లావాదేవీని నిలిపివేయడానికి ప్రయత్నించాలి. అనంతరం వెంటనే సైబర్ క్రైం అధికారులను ఆశ్రయించాలని.. అలాగే భయం.. తొందరపాటు.. అధికారుల పేర్ల వినియోగం.. ఇవే డిజిటల్ అరెస్టు మోసగాళ్ల ప్రధాన ఆయుధాలు. కాబట్టి ఎవరెంత భయపెట్టినా ముందుగా నిజానిజాలు నిర్ధారించుకోవడం, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం అత్యంత ముఖ్యం అని అధికారులు వివరించారు..

#Visakhapatnam#cyber fraud#Rs 1.5 crore#Kerala#man arrested
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి