తెలంగాణ

బీఆర్ఎస్‌ది దొంగ ప్రేమ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

రైతు రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఎంతమాత్రం లేదని మండిపడ్డారు.

రైతు రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఎంతమాత్రం లేదని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఆ పార్టీ నేతలు, ప్రస్తుతం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కపట ప్రేమ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి తుమ్మల గణాంకాలతో సహా ఎండగట్టారు. 2014లో మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చినప్పటికీ రూ.లక్ష రుణమాఫీని ఏకకాలంలో చేయకుండా నాలుగేళ్ల పాటు విడతలవారీగా సాగదీసి, రైతులపై అదనంగా రూ.2,630 కోట్ల వడ్డీ భారం మోపారని ఆరోపించారు. ఇక 2018 ఎన్నికల వేళ మళ్లీ రుణమాఫీ అని చెప్పి, సగం మందికే వర్తింపజేసి ఏకంగా రూ.8,379 కోట్ల బకాయిలను బకాయిలుగానే వదిలేసి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి పంట కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల వరకు ఉన్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి చూపించిందని మంత్రి వెల్లడించారు. ఒకే విడతలో రూ.20,617 కోట్ల నిధులను విడుదల చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25,35,964 మంది రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చామని స్పష్టం చేశారు. ఈ పారదర్శక ప్రక్రియ వల్ల ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోనే అతి తక్కువ రైతు రుణ బకాయిలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

ఇటీవల పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన నివేదికే రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, తమ కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి గల వ్యత్యాసాన్ని రైతాంగం గమనిస్తోందని తుమ్మల స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్ని విమర్శలు వచ్చినా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని పునరుద్ఘాటించారు.

#Tummala Nageswara Rao Agricultural Minister#Telangana Rythu Runa Mafi 2026#Congress vs BRS Farm Loan Waiver#Telangana Agriculture News Telugu#BRS Loan Waiver Critics#Telangana Congress Farmer Schemes#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి