కాంగ్రెస్ పార్టీ మీద ధిక్కార స్వరం వినిపిస్తున్న మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆ పార్టీలో కొత్త చర్చకు తెరతీశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ నిర్వహించిన పీఏసీ మీటింగ్‌కు ఆయన హాజరుకాలేదని తెలుస్తోంది. దీంతో మీనాక్షి నటరాజన్ మునుగోడు ఎమ్మెల్యే మీద గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఈ విషయం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చకు దారి తీసింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీగా నిలబడిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం తనకు మాట ఇచ్చిందని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తీరా ఎన్నికలయ్యాక పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి గెలిచినా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కలేదు. కారణం సీనియారిటీ, కుల సమీకరణలో భాగంగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి దక్కింది.
మరల ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదని, ఇస్తే పార్టీలో అసంతృప్తి జ్వాలలు పెరగడంతో పాటు తిరుగుబాటు వస్తుందని ముందే గ్రహించిన అధిష్టానం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన మంత్రి పదవి దక్కలేదని సమయం దొరికినప్పుడల్లా పార్టీ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం కార్నర్ చేస్తున్నారు. రీసెంట్‌గా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలు కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని మీనాక్షి నటరాజన్‌కు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే మీనాక్షి పీఏసీ మీటింగ్ ఏర్పాటు చేసింది. దానికి మునుగోడు ఎమ్మెల్యే హాజరుకాలేదు. రాజగోపాల్ రెడ్డి సైతం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఇప్పటికే ఫైర్ అయ్యారు. రెండ్రోజుల కిందట బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్‌ను మెచ్చుకుని, అధికార పార్టీని, మంత్రుల మీద సీరియస్ అయ్యారు.
దీనిపై స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే.. ‘పార్టీలో చేరినోళ్లకు,చేర్చుకున్నోళ్లకు బుద్ది లేదు. సీఎం రేవంత్ రెడ్డికి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరికీ బుద్ధి లేదు’ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అది కాస్త వైరల్ అవ్వడంతో ఆయన మీద క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పార్టీలో చర్చ జరుగుతోంది. తాజాగా మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన మీటింగ్‌కు మునుగోడు ఎమ్మెల్యే రాకపోవడంతో నిజంగానే ఆయనపై చర్యలుంటాయని టాక్ వినిపిస్తోంది.


