విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే ఆలయాల వంటి విద్యాసంస్థల్లో తరచుగా.. అధ్యాపకులపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. డీయూ లా ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ చేస్తున్న శుభమ్ సింగ్.. ఉమంగ్ భవన్ ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉండి.. అక్కడికి వచ్చిన లా ఫ్యాకల్టీ సీనియర్ ప్రొఫెసర్ అనుపమ్ ఝాపై అకస్మాత్తుగా దాడికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అడ్డుకునేందుకు ఇతర విద్యార్థులు ప్రయత్నించినప్పటికీ.. ప్రొఫెసర్‌పై పలుమార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు క్యాంపస్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ ఘటనపై మారిస్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అలాగే డీయూ యాజమాన్యం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.
శుభమ్ సింగ్‌ను లా ఫ్యాకల్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు.. యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా ఘటన వెనుక కారణాలను తేల్చేందుకు ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక గతంలోనూ దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో విద్యార్థులు అధ్యాపకులతో వాగ్వాదానికి దిగడం, బెదిరింపులకు పాల్పడటం, చివరకు దాడులకు దిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
గురువును గౌరవించే సంస్కృతి బలహీనపడటం.. చిన్న వివాదాలు పెద్ద ఘర్షణలుగా మారడం.. సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల్లో పెరుగుతున్న అసహనం వంటి అంశాలు ఇలాంటి ఘటనలకు కారణాలుగా చర్చకు వస్తున్నాయి..
అధ్యాపకుడితో సమస్య ఉంటే ఫిర్యాదు చేయడానికి, చర్చించడానికి, చట్టపరమైన మార్గాలను ఆశ్రయించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ దాడి చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన క్యాంపస్‌లు.. ఘర్షణలకు వేదికలుగా మారకుండా యూనివర్సిటీలు కఠిన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందనే వాదన సైతం వినిపిస్తుంది.


