National

యువత దెబ్బతో BJP అలర్ట్? సోషల్ మీడియాలో కొత్త గేమ్ షురూ!

రచన: Kashi••8 నిమిషాల పఠనం

సోష‌ల్ మీడియా హెడ్‌ను మార్చ‌డ‌మ‌నేది పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగం. కానీ కొత్త డిజిటల్ చీఫ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే Gen Z, Instagram, Reels గురించి ప్రత్యేకంగా మాట్లాడటం మాత్రం ఒక విషయం స్పష్టం చేస్తోంది.. యువతతో డిజిటల్ కనెక్ట్‌ను బీజేపీ ఇక మరింత సీరియస్‌గా తీసుకోబోతోంది.

కాక్రోచ్ ఉద్య‌మంతో బీజేపీ అల‌ర్ట్

సోషల్ మీడియా హెడ్‌ను మార్చిన పార్టీ

అమిత్ మాలవీయ స్థానంలో దీపక్ మాష్కే

భారత రాజకీయాల్లో ఇప్పుడు మరో కొత్త యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. అది ఎన్నికల సభల్లో కాదు.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై! యువత చేతిలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, షార్ట్ వీడియోలు.. ఇప్పుడు రాజకీయ పార్టీలకు కేవలం ప్రచార వేదికలు కాదు. అవే ఓటర్లను చేరుకునే ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ మారుతున్న రాజకీయ వాతావరణాన్ని బీజేపీ కూడా సీరియస్‌గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

అందుకే పార్టీ డిజిటల్ టీమ్‌లో కీలక మార్పు చేసింది. దాదాపు పదేళ్లుగా బీజేపీ సోషల్ మీడియా వ్యవస్థను నడిపిన అమిత్ మాలవీయ స్థానంలో దీపక్ మాష్కేను నేషనల్ సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమించింది. కొత్త బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో జరిగిన ఈ సంస్థాగత మార్పుల్లో ఇది కీలక నిర్ణయంగా క‌నిపిస్తోంది.

అయితే.. ఇది కేవలం ఒక వ్యక్తి మార్పేనా? లేక బీజేపీ డిజిటల్ వ్యూహంలోనే పెద్ద మార్పుకు సంకేతమా? అనే చర్చ మొదలైంది.

ఎందుకంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్న మాష్కే స్వయంగా తన ప్రాధాన్యతలను స్పష్టంగా చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రత్యేక ఫోకస్.. రీల్స్ ద్వారా యువతను చేరుకోవడం.. Gen Z కోసం ప్రత్యేక కంటెంట్ రూపొందించడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఉంటుందని చెప్పారు. యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటున్నందున పార్టీ సందేశాలను షార్ట్ వీడియోల రూపంలో వారికి చేరువ చేయాలన్నది కొత్త వ్యూహంగా కనిపిస్తోంది.

బీజేపీ డిజిట‌ల్ గేమ్ ఏంటి..?

యువ ఓటరు మారుతున్నాడు. రాజకీయాలను చూసే విధానం మారుతోంది. ఒకప్పుడు పార్టీ సభలు, టీవీ డిబేట్లు, పత్రికలే రాజకీయ ప్రచారానికి ప్రధాన మార్గాలు. ఇప్పుడు 30 సెకన్ల రీల్ ఒక నాయకుడి ప్రసంగం కంటే వేగంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఒక మీమ్ ఒక రాజకీయ వాదనను గంటల్లో వైరల్ చేస్తోంది. ఒక చిన్న వీడియో.. ప్రభుత్వంపై ప్రశంసనైనా, విమర్శనైనా.. లక్షల మందికి చేరుతోంది.

ఇటీవల జరిగిన జెన్ జీ నిరసనల్లో కూడా సోషల్ మీడియా ఎంతటి ప్రభావాన్ని చూపగలదో రాజకీయ పార్టీలకు మరోసారి స్పష్టమైంది. యువత సోషల్ మీడియాలో ఒక నేరేటివ్‌ను సృష్టించి.. దాన్ని వేగంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లగలదనే విషయం ఈ పరిణామాలు చూపించాయి.

యువ‌త దూర‌మ‌వుతోంద‌నే భ‌యం ప‌ట్టుకుందా..?

సోష‌ల్ మీడియా హెడ్‌ను మార్చ‌డ‌మ‌నేది పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగం. కానీ కొత్త డిజిటల్ చీఫ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే Gen Z, Instagram, Reels గురించి ప్రత్యేకంగా మాట్లాడటం మాత్రం ఒక విషయం స్పష్టం చేస్తోంది.. యువతతో డిజిటల్ కనెక్ట్‌ను బీజేపీ ఇక మరింత సీరియస్‌గా తీసుకోబోతోంది.

మరి ఇంతకాలం అమిత్ మాలవీయ నేతృత్వంలో బీజేపీ డిజిటల్ వ్యవస్థ ఏ స్థాయికి వెళ్లింది? సోషల్ మీడియాలో పార్టీకి ఒక బలమైన, దూకుడైన కమ్యూనికేషన్ మెషినరీని నిర్మించడంలో మాలవీయ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన స్థానంలో వచ్చిన మాష్కే మాత్రం డేటా, ఎన్నికల విశ్లేషణ, సంస్థాగత పని నేపథ్యం ఉన్న నాయకుడిగా కనిపిస్తున్నారు. అంటే బీజేపీ డిజిటల్ ప్రచారాన్ని కేవలం వైరల్ కంటెంట్ నుంచి డేటా + టార్గెట్‌డ్ కమ్యూనికేషన్ + యువతకు ప్రత్యేక కంటెంట్ వైపు తీసుకెళ్లాలనుకుంటోందా? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.

ప్రచారం మాత్రమే కాదు, కౌంటర్ నేరేటివ్ కూడా...

మాష్కే చెప్పిన ప్రకారం.. విదేశీ ఖాతాల నుంచి వచ్చే ప్రచారం, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం కూడా కొత్త డిజిటల్ వ్యూహంలో ముఖ్యమైన భాగం. అంటే బీజేపీ సోషల్ మీడియా టీమ్ ఇకపై కేవలం ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడమే కాకుండా.. ప్రతిపక్షాల విమర్శలకు డిజిటల్ స్థాయిలో వేగంగా స్పందించేందుకు ప్రయత్నించబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ప‌రిస్థితేంటి..?

రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాలో బలమైన నేరేటివ్‌లను నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఉద్యోగాలు, నిరుద్యోగం, పరీక్షల వ్యవస్థ, ధరలు వంటి అంశాలపై డిజిటల్ ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇక బీజేపీ కూడా యువత కోసం ప్రత్యేకమైన డిజిటల్ వ్యూహాన్ని రూపొందిస్తే.. 2029 ఎన్నికల పోరు గ్రౌండ్‌లో ఎంత ఉంటుందో.. మొబైల్ స్క్రీన్‌పై కూడా అంతే ఉండే అవకాశం ఉంది.

అంటే రేపటి ఎన్నికల్లో ఎవరి సభకు ఎక్కువ మంది వచ్చారు? అన్నదే కాదు.. ఎవరి రీల్ ఎక్కువ మందికి చేరింది? అన్నది కూడా రాజకీయ పార్టీలకు ముఖ్యమైన లెక్కగా మారవచ్చు.

రీల్స్‌తోనే ఆక‌ట్టుకుంటారా..?

ఉద్యోగాలు కావాలి.. మంచి విద్య కావాలి.. పరీక్షల్లో పారదర్శకత కావాలి.. అవకాశాలు కావాలి.. ధరలపై ఉపశమనం కావాలి. ఇవే యువతకు అసలు ప్రశ్నలు. కాబట్టి రాజకీయ పార్టీలు కేవలం తమ విజయాలను చూపించే వీడియోలు పెడితే సరిపోదు. యువత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే.

అందుకే బీజేపీకి ముందున్న అసలు పరీక్ష సోషల్ మీడియా టీమ్ మార్చడం కాదు.. యువతతో నమ్మకమైన కనెక్షన్‌ను నిర్మించగలదా? అన్నదే. మరి ఈ కొత్త డిజిటల్ గేమ్ బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అమిత్ మాలవీయ దూకుడు శైలికి భిన్నంగా దీపక్ మాష్కే డేటా, యువత, రీల్స్ ఆధారిత వ్యూహాన్ని ఎంతవరకు అమలు చేస్తారు? కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దీనికి ఎలా కౌంటర్ ఇస్తాయి? ఇప్పుడిదే జాతీయ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్.

#BJP#BJP Social Media#Gen Z#Indian Politics#Narendra Modi#Nitin Nabin#Deepak Mhaskey#Amit Malviya#BJP IT Cell#Social Media Politics#Instagram Reels#Youth Politics#Digital Politics#2029 Elections#BJP Strategy#India Politics#Political News#Latest Political News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి