కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం ముదురుతోంది. పదవులు వచ్చిన వాళ్లు ఇతర పనుల్లో బిజీగా ఉంటే రాని వారు మాత్రం పార్టీని, అధిష్టానం పెద్దలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలోనే వనపర్తి జిల్లాలో ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డి మధ్య కొత్తగా మాటల యుద్ధం నెలకొంది.డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నాడని చిన్నారెడ్డి చేసినవ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ పెట్టినట్టు తెలుస్తోంది.
చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేదంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తా అని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో వనపర్తిలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కుతున్నదని ప్రచారం జరుగుతోంది. మేఘారెడ్డి మాట్లాడుతూ.. ‘8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నువ్వు ఎన్ని డబ్బులు చెల్లించావు? ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా, అధిష్ఠానంపై డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి రెన్యువల్ కోసమే చిన్నారెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.చిన్నారెడ్డి తీరుపై క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవికి ఫిర్యాదు చేశాను.త్వరలో కాంగ్రెస్ అధిష్ఠానానికి, రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తాను.చిన్నారెడ్డిని వారం రోజుల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే, వేలాది కార్యకర్తలతో గాంధీ భవన్‌ను ముట్టడిస్తాను’ అని వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి అధికార పార్టీకి అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, రెండ్రోజుల కిందట వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి,సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘సోనియా గాంధీ నాకు టికెట్ ఇచ్చి, డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టి గెలిపించమని రేవంత్‌కు చెప్పింది.కానీ, డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని రేవంత్ అతనికే టికెట్ ఇచ్చాడు. వనపర్తి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేస్తున్నారు.. పరిస్థితులు చూస్తే చాలా బాధగా ఉంది. కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చారు.వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి రూ.కోట్లు తింటున్నారు.
అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులను అడిగితే, మీ ఎమ్మెల్యే ఆపారంటున్నారు. కాంట్రాక్టులు తన మనుషులకు రాలేదని, మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నాడని చెబుతున్నారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చా. మేఘారెడ్డి నా అనుచరులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు, జీవన్ రెడ్డిలా నేను కూడా తిరగబడతా. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్లను, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమేస్తాను’ అని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


