తెలంగాణ

BRS : 22ఏ తప్పిదం.. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి : హరీశ్‌రావు

రచన: Kumar••11 నిమిషాల పఠనం

22ఏ నిషేధిత భూముల తప్పిదంలో నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి చేసిన తప్పును అధికారుల మీదకు నెట్టడం సరికాదని, ఎలాంటి దరఖాస్తు లేకుండా, బాధితులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా భూములు తొలగించాలన్నారు.

22ఏ నిషేధిత భూముల తప్పిదంలో నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి చేసిన తప్పును అధికారుల మీదకు నెట్టడం సరికాదని, ఎలాంటి దరఖాస్తు లేకుండా, బాధితులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా భూములు తొలగించాలన్నారు. జాబితాలో ప్రజల భూములు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టించారు? వాస్తవం బయట పడాలని కోరారు. నిషేధిత భూముల తొలగింపు పేరుతో మీ కబ్జా భూములు రెగ్యులరైజ్ చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. పొంగులేటి చెప్పిన ‘టోల్ ఫ్రీ నంబర్’ పని చేయడం లేదని.. కానీ, జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుందన్నారు.

22A నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్‌గిరిలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి హాజరైన హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డి తీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు.

అవన్నీ పట్టా భూములే..

2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ULCని రద్దు చేసిందని, ఆ తర్వాత ఆ భూములు పట్టా భూములుగా మారి,ఏళ్లుగా ప్రజలు అక్కడ నివసిస్తున్నారని తెలిపారు. 20 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు సృష్టించారని ప్రశ్నించారు. రంగారెడ్డిలో 7,500 జీఓల ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్‌లో 6,000కు పైగా భూములు, HMDA, HUDA భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై పట్టు సాధించేందుకే నిషేధిత భూముల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

‘భూమిని అమ్మడానికి వెళ్లేంత వరకు అది తమదా? నిషేధిత జాబితాలో ఉందా? అనే విషయం కూడా ప్రజలకు తెలియడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షలాది స్థలాలు, ఇళ్లను జాబితాలో చేర్చారు. తిలక్‌నగర్‌కు చెందిన అశోక్ 450 గజాల ఇంటిని అమ్మాలని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత అది నిషేధిత జాబితాలో ఉందని తెలిసింది. మరుసటి రోజు అమెరికా వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. ఇప్పుడు అశోక్ పరిస్థితి ఏమిటి? అమెరికా వెళ్లాలా? వద్దా? అక్కడ ఉద్యోగం చేయాలా? వద్దా?’ అని ప్రశ్నించారు.

బిగ్ టీవీ జర్నలిస్ట్ అశోక్ తనకు ఎదురైన సమస్యను సోషల్ మీడియాలో తెలిపారని, ఆయన ఒక్కరే కాదు.. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఎంతోమంది జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఉన్నారన్నారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 30 శాతం భూమి ఇవ్వాలని, డెవలప్‌మెంట్ హక్కులు కూడా ఇవ్వాలని అడుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఇది తెలంగాణలో జరుగుతున్న దారుణమైన పరిస్థితి అని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తప్పు ఏమీ లేనట్లుగా అధికారులపై నెపం నెట్టడం సరికాదన్నారు.

తప్పు మీరు చేసి అధికారులను బలి చేస్తారా?

“పెద్ద తప్పు చేసి ఇప్పుడు సారీ చెబుతున్నారు. సారీ చెబితే ప్రజల బాధలు తీరుతాయా? అసలు జాబితాలో భూములను చేర్చింది ఎవరు? చేర్చమని ఆదేశించింది ఎవరు? ఇష్టానుసారంగా జాబితాలో పెడతారా? అధికారుల పేర్లు చెప్పి తప్పించుకుంటారా?” అని ప్రశ్నించారు.

నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి పొంగులేటి.. తన రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేయకుండా కావాలనే నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.2,600 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.

సంతానలక్ష్మిగా కల్యాణ లక్ష్మి..

“కల్యాణలక్ష్మి ఇప్పుడు సంతానలక్ష్మిగా మారింది.పెళ్లి సమయంలో అందాల్సిన సాయం పిల్లలు పుట్టిన తర్వాత వస్తోంది.కల్యాణలక్ష్మి విషయంలో పొన్నం ప్రభాకర్ అధికారుల తప్పు అంటున్నారు.నిషేధిత భూముల విషయంలో పొంగులేటి కూడా అధికారుల తప్పు అంటున్నారు. తప్పు మీది.. అధికారులది కాదు. తప్పు మీరు చేస్తారు? దరఖాస్తులు మాత్రం ప్రజలు పెట్టుకోవాలా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

“నిషేధిత జాబితాలో పెట్టింది మీరే కాబట్టి.. తీసేయాల్సింది కూడా మీరే.ఎట్లా పెట్టారో..అట్లాగే తొలగించండి.ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి” అని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి నివాసం కూడా 22A పరిధిలో ఉందంటూ వచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ, “సీఎం ఇంటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటే.. సారీ ముఖ్యమంత్రికి చెప్పారా పొంగులేటి?” అని ప్రశ్నించారు.

నైతిక విలువలు ఉంటే నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలు, తొలగించిన భూముల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని, దీనిపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.22A జాబితా తొలగింపులో పూర్తి పారదర్శకత ఉండాలని, నిజమైన భూ హక్కుదారుల భూములను మాత్రమే తొలగించాలని స్పష్టం చేశారు. “22A ముసుగులో అక్రమంగా ఆక్రమించిన లేదా వివాదాస్పద భూములను తొలగిస్తే మాత్రం బీఆర్‌ఎస్ ఊరుకోదు” అని హెచ్చరించారు.

అధికారులు ముక్కసూటిగా పనిచేయండి..

‘అధికారుల్లారా.. తప్పులు మంత్రులు చేస్తారు. నెపం మాత్రం మీ మీదకు నెడతారు. సీఎం,మంత్రుల ఆదేశాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జాబితాలు మార్చడం సాధ్యమా? మీరు చెప్పినట్లు తప్పులు చేస్తే చివరకు మీరు ఇరుక్కుంటారు. మీరు బాధపడాల్సి వస్తుంది. ముక్కుసూటిగా పనిచేయండి.తప్పు చేయకండి.బలికాకండి” అని అధికారులకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి వెంటనే సంబంధిత మంత్రిని పదవి నుంచి తొలగించాలన్నారు.“మంత్రి చేసిన తప్పులకు సీఎం చర్యలు తీసుకోకపోతే.. ఇద్దరూ కలిసి కుట్రపూరితంగా ఈ భూ దందా చేశారనే అనుమానాలు ప్రజల్లో మరింత బలపడతాయి” అని అన్నారు. “వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. తప్పు చేసిన ఈ కాంగ్రెస్ నాయకులను చట్టపరంగా బాధ్యులను చేస్తాం. 22A నిషేధిత భూముల విషయంలో అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుంది.కేసీఆర్ నాయకత్వంలో మేమంతా ప్రజలకు అండగా ఉంటాం” అని హరీశ్ రావు తెలిపారు.

“తెలంగాణ భవన్‌లోని జనతా గ్యారేజీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.ఎవరికైనా సమస్య ఉంటే రండి. మేము మీకు అండగా ఉంటాం. కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారు.రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు.తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుంది” అని హరీశ్ రావు స్పష్టంచేశారు.

#harish rao#22A prohibited lands#ponguleti srinivas reddy#politics#brs#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి