ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తనువు చాలించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పేజీల సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం చేసుకున్నాడు. అందులో తన చావుకు తెలంగాణ ప్రభుత్వం, తన చిన్నబావమరిది, హైకోర్టు జడ్జి పేరును సైతం ప్రస్తావించారు. బంధువులు కూడా కారణమని పేర్కొన్నాడు.
వివరాల్లోకివెళితే.. జనగామ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగి పగిడిపల్లి మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు బాండ్ పేపర్ మీద తన నుంచి డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు రాశారు.అందులో తన బావమరిది, ఇతర బంధువులు పేర్లు మెన్షన్ చేశాడు. ఒక్కొక్కరు సుమారు రూ.లక్షలకు పైగానే ఇవ్వాల్సి ఉందని వెల్లడించాడు. దానికి తోడు ‘నా చావుకు తెలంగాణ ప్రభుత్వం’ కూడా కారణమని రాశాడు.
తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్(GPF) ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తోందని, వాటిని ఇప్పించలేని హైకోర్టు జడ్జి కూడా తన చావుకు ఒక కారణమంటూ లేఖలో మల్లయ్య పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు ఫైల్ చేశారు. కాగా, ప్రస్తుతం ఆ నోట్ నెట్టింట్ వైరల్ అవుతోంది.












